HCL: లేఆఫ్స్ షాక్‌ల తర్వాత.. కంపెనీ నుంచి గుడ్ న్యూస్!
దేశీయ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యూహం మార్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఓ భారీ డేటా సెంటర్ ను నెలకొల్పడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. దీనికోసం మొదటి విడత కింద ఏకంగా 3,500 కోట్ల రూపాయల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టబోతోంది. ఏఐలో ఎదురవుతున్న తీవ్ర పోటీని ఎదుర్కొనడానికి ఆ సంస్థ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే లేఆఫ్స్ ప్రకటించింది హెచ్‌సీఎల్. 3,300 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో జూన్ 30వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో పని చేస్తోన్న టెక్కీల సంఖ్య 2,27,181 నుంచి 2,23,889కి పడిపోయింది. ఇక మున్ముందు కూడా లేఆఫ్స్ ఉండొచ్చనీ చెబుతోంది. మానవ వనరులకు బదులుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారీ డేటా సెంటర్ నిర్మించాలని తలపెట్టింది.

2030 నాటికి ఏఐ డిమాండ్ మూడింతలు అవ్వొచ్చని, ఈ లోపే ఈ మార్పును అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌సీఎల్ సీఈఓ సీ విజయకుమార్ తెలిపారు. ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే డేటా సెంటర్ల వైపు మొగ్గు చూపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓపెన్ ఏఐలో ఇప్పటికే హెచ్‌సీఎల్‌కు వాటా కూడా ఉంది. ప్రారంభ దశలో 50 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ ను నెలకొల్పనున్నామని, దీనికోసం 3,500 కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
డేటా సెంటర్లు, ట్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఏఐ మోడల్స్, అప్లికేషన్ల దిశగా అడుగు వేస్తోన్నామని, ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఏఐ డేటా సెంటర్లు, టూల్స్ డెవలప్మెంట్, వాటి వినియోగం విషయంలో ఇప్పటికే క్లయింట్లతో సంప్రదింపులు సైతం మొదలు పెట్టామని విజయకుమార్ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేటగిరీలో రోజురోజుకూ పోటీ తీవ్రతరమౌతోందనే విషయాన్ని ఆయన అంగీకరించారు.
ఇప్పటికే టీసీఎస్ కూడా డేటా సెంటర్ల నిర్మాణం వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఒక గిగా వాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్ ను నెలకొల్పనున్నట్లు గత ఏడాది అక్టోబర్ లో ప్రకటించిందా టెక్ జెయింట్. దీనికోసం మొత్తం ఆరు బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో 8,900 మంది ఫార్వర్డ్ డెప్లాయ్డ్ ఇంజినీర్లను కూడా నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ పరిణామాలన్నీ కూడా టెక్ కంపెనీలన్నీ ఏఐకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తోన్నాయనేది స్పష్టం చేస్తోంది.














Click it and Unblock the Notifications