అసెంబ్లీలో చంద్రబాబు హెల్త్ టిప్స్..! మధ్యలో రఘురామపై సెటైర్లు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ డాక్టర్ అవతారం ఎత్తారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ వైద్యారోగ్యశాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం.. ఎమ్మెల్యేలకు, రాష్ట్ర ప్రజలకు కీలకమైన ఆరోగ్య జాగ్రత్తలు చెప్పారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూనే మరోవైపు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చంద్రబాబు వివరించారు. మధ్యలో సభాధ్యక్ష స్ధానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామపై జోకులు కూడా వేశారు.
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ "ఆహారమే ఔషధం, వంటశాలే ఫార్మసీ"అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని పాటించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ తమ జీవన విధానం మార్చుకోవాలని కోరారు. ముఖ్యంగా పంచదార, ఉప్పు, వంటనూనెల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రశాంతంగా జీవించడం, రోజుకు 8 గంటలు నిద్రపోవడం అందరికీ తప్పనిసరి అన్నారు.

ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్సల కంటే రూమ్ ల ధరలు పెరిగిపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రెండో బిడ్డను వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రభుత్వం తరఫున ప్రతీ ఒక్కరికీ 41 రకాల ఆరోగ్య చికిత్సలు చేయిస్తున్నామని, హెల్త్ రికార్డుల్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ 2.5 లక్షల ఆరోగ్య బీమా కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామపై చంద్రబాబు సెటైర్లు వేశారు. మనిషి సగటు వయస్సు 120 ఏళ్లని, కానీ 40 ఏళ్లకే 120 ఏళ్లకు తినాల్సినంత తినేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అది మీక్కూడా వర్తిస్తుందంటూ రఘురామను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో సభలో రఘురామ సహా ఎమ్మెల్యేలంతా నవ్వుకున్నారు. ఈ చర్చ చివర్లో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. 120 ఏళ్ల ఆయుర్దాయం దిశగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ తప్పకుండా ముందుకు వెళ్తుందని తెలిపారు. చంద్రబాబు సూచనల్ని తనతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా తప్పుకుండా పాటిస్తామని రఘురామ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications