ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూల్‌లో మార్పులు: ఆ పది రోజుల్లోనే పూర్తి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన ప్రక్రియ షెడ్యూల్‌లో మార్పులు చేర్పూలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 19వ తేదీ నుంచి 28వ తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గ్రామవార్డు సచివాలయ సిబ్బంది, ఎన్యుమరేటర్లు వారం రోజుల్లో ఇంటింటికీ వెళ్లి కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.
మొత్తం 10 రోజుల్లో ఈ కుల గణన ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటింటికి కులగణన ప్రక్రియలో అందుబాటులోని లేని వ్యక్తులకు సచివాలయాల్లో నమోదుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ ఐదు రోజులపాటు వెసులుబాటు కల్పించింది.

ఫిబ్రవరి 15వ తేదీ నాటికి గ్రామవార్డు సచివాలయాల శాఖ వద్ద కులగణనకు సంబందించిన తుది నివేదిక సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. కులగణన కోసం సచివాలయ సిబ్బందికి ఇచ్చే శిక్షణను జనవరి 11వ తేదీలోగా ముగించాలని ఆదేశించింది.
ఎన్యూమరేటర్లు, సచివాలయ సిబ్బంది, సూపర్ వైజర్ల మ్యాపింగ్ 12వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కులగణనలో భాగంగా సామాజిక ఆర్థిక, విద్యా, ఉపాధి అంశాలపై వివరాలు సేకరించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. కాగా, దేశంలోని పలు రాష్ట్రాలు కూడా కులగణన చేపడుతున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి పలు రాజకీయ పార్టీల నేతలు.












Click it and Unblock the Notifications