పవన్ కోసం మూడు స్థానాలు - పబ్లిక్ డిమాండ్, కొణిదల సొంతం...!!
జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం ఏది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తిగా మారిన చర్చ. పవన్ అభిమానులు..జనసైనికులతో పాటుగా ప్రతిపక్షాలు తెలుసుకోవాలనుకుంటున్న అంశం. దీని పైన ఇప్పటి వరకు పవన్ ప్రకటన చేయలేదు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవటంతో ఈ సారి ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కు మూడు స్థానాలు సూచనగా వచ్చాయి. వీటిల్లో పోటీకి పవన్ సిద్దంగా ఉన్నారా.
పవన్ పోటీ స్థానం ఎక్కడ : పవన్ కల్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి నుంచి రేపు పశ్చిమ గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తోంది. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఈ సారి గోదావరి జిల్లాల పైన నమ్మకం పెట్టుకున్నారు. అందులో భాగంగానే గోదావరి నుంచి తన వారాహి యాత్ర ప్రారంభించారు.

పవన్ సీఎం కావాలని తొలి నుంచి కోరుకుంటూ..అండగా నిలుస్తున్న మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య ఒక లేఖ విడుదల చేసారు. అందులో పవన్ పశ్చిమ గోదావరిలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేయాలంటూ మూడు నియోజకవర్గాలను సూచించారు.
మూడు నియోకవర్గాల సూచన : వచ్చే ఎన్నికల్లో నర్సాపురం, భీమవరం ,తాడేపల్లిగూడెంలో ఏదో ఒక నియోజక వర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనేది అభిమానులు..ప్రజలు కోరుకుంటన్నారని జోగయ్య పేర్కొన్నారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమని సామెతతో భీమవరం నుంచి పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు.
నరసాపురం నియోజకవర్గం కొణిదెల కుటుంబంకు సొంత నియోజకవర్గం అని చెప్పారు. 2009లో పిఆర్పీ తాడేపల్లిగూడెం స్థానం నుంచి ఘనవిజయం సాధించిందని ఈ 3 స్థానాల్లో ఎక్కడో ఒకచోట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. పవన్ తాను పోటీ చేసే స్థానం పైన ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

పవన్ తేల్చేస్తారా : పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో సర్వేలు చేయించారు. ఉమ్మడి 13 జిల్లాల్లో 8 స్థానాల్లో వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో భీమవరం..గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సమయంలో పవన్ ఈ సారి తూర్పు గోదావరి నుంచి పోటీ చేస్తారనే అంచనాలు కనిపిస్తున్నాయి. పిఠాపురం లేదా కాకినాడ రూరల్ నుంచి పవన్ ఈ సారి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది.
రాయలసీమ నుంచి రెండో స్థానంగా ఎంచుకుంటారని భావిస్తున్నారు. ఇప్పుడు మరోసారి పశ్చిమ గోదావరిలో పోటీ చేయాలంటూ హరిరామ జోగయ్య సూచించిన మూడు స్థానల్లోనూ జనసేకు బలం ఉందనే విశ్లేషణలు ఉణ్నాయి. దీంతో..యాత్ర ముగింపు లోగా పవన్ తాను పోటీ చేసే నియోజకవరర్గం పైన స్ఫష్టత ఇస్తారనే అంచనాలతో మరింత ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications