''అమ్మ రాజీనామా''పై ముఖ్యమంత్రి జగన్ కు సమాచారం లేదా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్లీనరీలో పాల్గొన్న విజయమ్మ స్టేజీపై వైసీపీకి సంబంధించిన విధానాలను వివరించడంతోపాటు ప్రతిపక్షపార్టీలపై విమర్శలు గుప్పించారు. అందరూ ప్రసంగం అయిపోయిందనుకుంటున్న తరుణంలో విజయమ్మ రాజీనామా ప్రకటన చేయడంతో వైసీపీ శ్రేణులంతా అవాక్కయ్యారు. విజయమ్మకన్నా ముందు జగన్ ప్రసంగించారు. రాజీనామాపై జగన్‌కు సమాచారం ఉండి ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టహాసంగా జరుగుతున్న ప్లీనరీ కావడంతో తర్వాత సందర్భం చూసుకొని విజయమ్మ రాజీనామా ప్రకటించి ఉంటే బాగుండేదని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్లీనరీ వేదికమీద గౌరవాధ్యక్షురాలు రాజీనామా చేయడం మంచి పరిణామం కాదని, మనం ఆచారాలను, సాంప్రదాయాలను అనుసరిస్తాం కాబట్టి వేదిక మీద రాజీనామా చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. తన కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ తో సంప్రదించే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.

అధికారంలో ఉన్న పార్టీకి గౌరవాధ్యక్ష పదవిలో ఉన్నవారు రాజీనామా చేస్తే ఆ ఎఫెక్ట్ పార్టీపై పడటమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు ఒక ఆయుధాన్ని అందించినట్లవుతుందంటున్నారు. ముఖ్యమంత్రిగా కొడుకు సంతోషంలో ఉన్నాడు కాబట్టి తెలంగాణలో పార్టీ పెట్టిన కూతురికి అండగా ఉండాలనే నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని, శ్రేణులు క్షమించాలని విజయమ్మ కోరారు. విజయమ్మ రాజీనామావల్ల వైసీపీపై ఎటువంటి ప్రభావం పడదని, ఎప్పటిలాగే కార్యక్రమాలు జరుగుతుంటాయని వైసీపీ నేతలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications