పానీపూరి తిని ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు..
పానీపూరి తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలను విడిచారు.
నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాలనీకి చెందిన రవి అనే వ్యక్తి పొట్టకూటి కోసం జంగారెడ్డిగూడెం వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడే ఎన్నో యేళ్లుగా ప్లాస్టిక్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రవికి ఇద్దరు కుమారు. రామకృష్ణకు పదేళ్లు. విజయ్‌కు ఆరేళ్లు. ఎప్పుడూ తండ్రితో పాటు సరాదాగా బయటికి వెళ్లే పిల్లలు ఎంతో నీరసంగా కనిపించారు. అర్థరాత్రి సమయంలో ఇద్దరు కుమారులు తీవ్ర వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో రవి వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకుని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే రవి పెద్దకుమారుడు రామకృష్ణ చనిపోయాడు.

పానీపూరి తిని ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు : చిన్నకొడుకు విజయ్‌కి మెరుగైన చికిత్స కోంస ఏలూరు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ కుమారుడు కూడా దారిమధ్యలో ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవి ఇద్దరు కుమారులు రాత్రి నగరంలోని నిర్మల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఓ పానీపూరి బండి దగ్గర పానీ పూరీ తిన్నారని, అప్పటినుంచే వారు తీవ్ర వాంతులతో ఆస్వస్తతకు గురయ్యారని తండ్రి చెబుతున్నాడు. పానీపూరీ వల్లే ఇద్దరు కుమారులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని దాని కారణంగానే వారిద్దరూ మృతిచెందారని రవి ఆరోపిస్తున్నాడు.
ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారుల మృతిచెందడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. అప్పటివరకూ ఆడుకుంటూ ఉన్న చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇక, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, ఈ విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications