అనురాధ దంపతుల హత్య: చింటూ పోలీసుల కళ్లు ఎలా కప్పాడు?
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ పోలీసుల కళ్లు గప్పి అకస్మాత్తుగా కోర్టులో ఎలా ప్రత్యక్షమయ్యాడనేది ఆశ్చర్యకరంగానే ఉంది. అయితే, వర్షాన్ని అడ్డం పెట్టుకుని అతను పోలీసుల బారి నుంచి తప్పించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. చిత్తూరులో ఆ రోజు భారీగా వర్షం పడుతోంది.
వర్షాన్ని అడ్డం పెట్టుకుని ఆటోలో వచ్చిన చింటూ గొడుగు వేసుకుని కోర్టులోకి అకస్తాత్తుగా ప్రవేశించడాని, గొడుగు కింద మనిషిని గుర్తు పట్టడం కష్టమని పోలీసులు అంటున్నారు. చింటూ పకడ్బందీగా కోర్టులోకి ప్రవేశించినట్లు అర్థమవుతోంది. కోర్టులోకి ప్రవేశించగానే చింటూ టపాటపా కాయితాలపై సంతకాలు చేసి లొంగిపోయాడు. అతను కోర్టులోకి ప్రవేశించిన సమయంలో ఉద్రిక్తవాతావరణం చోటు చేసుకుంది.

చింటూ కోర్టులో లొంగిపోయిన రోజున అదే సమయంలో ఎస్పీ శ్రీనివాస్ నగరంలోని మరో వైపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు పురోగతిని వివరిస్తున్నారు. అనురాధ దంపతుల హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశామని, చింటూను పట్టుకుని తీరుతామని ఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో చెప్పారు.
చింటూను పట్టుకోవడానికి పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. చింటూ కోసం పోలీసులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అతను కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. నవంబర్ 17వ తేదీన అనురాధ దంపతులను హత్య చేసిన తర్వాత చింటూ పారిపోయాడు.












Click it and Unblock the Notifications