సేఫ్ జోన్‌లో మెగాస్టార్: చిరంజీవి కూతురు సుష్మిత ఆసక్తికర వ్యాఖ్య
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల పైన ఆయన కూతురు సుష్మిత పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో చిరు కూతురు సుష్మిత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆమె వ్యాఖ్యలు చిరంజీవి రాజకీయాలను ఉద్దేశించినట్లుగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మా నాన్న కంపర్టబుల్ జోన్లో ఉన్నారని, ఇప్పుడు తమకు చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.

తద్వారా, తన తండ్రి రాజకీయాల్లో కంటే సినీ రంగంలో ఉంటేనే తమకు ఇష్టమని సుష్మిత చెప్పకనే చెప్పారని అంటున్నారు. సుష్మిత చేసిన వ్యాఖ్యలపై అభిమానుల్లోను చర్చ జరుగుతోందంట.
కాగా, 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య స్థాపించిన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఓట్లు బాగా రాబట్టినా, సీట్లు మాత్రం ఆశించిన మేర రాలేదు. ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి మరణం, జగన్ పార్టీని వీడటం.. రెండు మూడేళ్లకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగాయి.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం పవన్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ జనసేనను స్థాపించారు. బిజెపి, టిడిపిలకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ పెట్టినప్పుడు అన్నయ్య పవన్‌కు చెప్పారని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు మాత్రం చెప్పలేదని ఓ సందర్భంలో నాగబాబు కూడా చెప్పారని అంటున్నారు.












Click it and Unblock the Notifications