జగన్ సందేశంతో చిరంజీవి - తెలుగు ఇండస్ట్రీ మద్దతిచ్చేనా : ఆ భేటీ పై ఉత్కంఠ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కీలక సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర తనకు వద్దంటూనే... తానే బాధ్యతలు తీసుకుంటున్న చిరంజీవి.. ఇండస్ట్రీ ముఖ్యులతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఏపీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల పైన పలువురు ప్రముఖులు పలు రకాలుగా స్పందించారు. అయితే, సినిమా టిక్కెట్ల వ్యవహారం మొదలు థియేటర్ల అంశాల వరకు సమస్యల పరిష్కార దిశగా సీఎం జగన్ మెగాస్టార్ ను తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకే తాను అమరావతి వచ్చినట్లుగా చిరంజీవి సైతం పలు సార్లు చెప్పుకొచ్చారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక భేటీ
సీఎం జగన్ - చిరంజీవి లంచ్ మీట్ లో ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను చిరంజీవి నేరుగా సీఎంకు వివరించారు. సీఎం సానుకూలంగా స్పందించారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ సినిమా టిక్కెట్ల ధరల పైన నివేదిక ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. ఆ కమిటీ నివేదిక ముసాయిదా అందిన తరువాత..తుది నిర్ణయం.. ఉత్తర్వుల జారీ సమయంలో మరోసారి రావాలంటూ చిరంజీవికి సీఎం జగన్ సూచన చేసారు. అందుకు చిరంజీవి సైతం ఓకే చెప్పారు. అయితే, ఆ సమావేశానికి సైతం తనను రావాల్సిందిగా సీఎం సూచించారని.. మిగిలిన వారిని సైతం ఆహ్వానిస్తే అందరం కలిసే వస్తామంటూ చిరంజీవి స్పష్టం చేసారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరారు.

సీఎంతో భేటీపై చిరంజీవి వివరణ
అయితే, కొద్ది రోజుల క్రితం చిరంజీవి చిరంజీవి రెండో సారి కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని.. స్వల్పంగా లక్షణాలున్నాయని తెలిపిన ఆయన.. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నట్లు ట్వీట్ చేశారు. కాగా, చిరు ఇటీవల టెస్ట్ చేసుకోగా తనకు నెగిటివ్ వచ్చిందని.. దాంతో తిరిగి 'గాడ్ ఫాదర్' సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. ఇక, రేపు (సోమవారం) ఉదయం టాలీవుడ్ కీలక సమావేశం జరనుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మెగాస్టార్ చిరంజీవి సోమవారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించిన విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

చిరంజీవికే బాధ్యతలు అప్పగిస్తారా
నిర్మాతల నుంచి సినీ కార్మికుల వరకు తాను ప్రస్తావించిన అంశాలు.. సీఎం జగన్ స్పందన గురించి చిరంజీవి వివరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇండస్ట్రీలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖుల నుంచి వారు ఏం కోరుకుంటున్నా రనే అంశంతో పాటుగా వారి నుంచి సూచనలు..సలహాలు తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. వీటిని క్రోడీకరించి.. సీఎం జగన్ తో భేటీ సమయంలో నివేదించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో.. పరిశ్రమలోని అన్ని విభాగాలకు చెందిన ప్రముఖులు హాజరు అవుతుండటంతో ఈ సమావేశం పైన ఉత్కంఠ నెలకొని ఉంది. పరిశ్రమలోని అందరూ ఇప్పుడు చిరంజీవి మాత్రమే సీఎం వద్దకు వెళ్లి...తమ వాదన.. సమస్యలు వినిపించటం పైన తమ మద్దతు తెలుపుతారా లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అంటూ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ మొదలైంది.

సీఎం మాత్రం చిరంజీవి పైనే నమ్మకంతో
సీఎం జగన్ తో చర్చలు..సానుకూల స్పందన పైన ఇప్పటి వరకు చిరంజీవితో పాటుగా నాగార్జున ఓపెన్ గానే హర్షం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు సినీ పెద్దల సమావేశంలో చిరంజీవి పాత్ర ఆసక్తి కరంగా మారబోతోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించే లోగా... టాలీవుడ్ ప్రముఖలతో జరిగే సమావేశం పైన అటు రాజకీయంగా... ఇటు సినీ పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఇక, చిరంజీవి పాత్ర పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications