ప్రచార సారథిగా చిరంజీవి: వెనక్కి పవన్ కళ్యాణ్?
హైదరాబాద్: సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) పిసిసి ఎన్నికల ప్రచార సారథిగా చిరంజీవి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాలనే నిర్ణయాన్ని విరమించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెసులో చిరంజీవికి తగిన స్థానం ఇవ్వలేదనే కోపంతో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెసును ఎదుర్కోవడానికి ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించకుండా చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయకపోవడం కూడా పవన్ కళ్యాణ్‌ను అసంతృప్తికి గురి చేసినట్లు చెబుతున్నారు. ఇది కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు కారణమైందని అంటున్నారు. అయితే, చిరంజీవితో పడకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నారని అంటున్నారు. చిరంజీవిని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులు కావడంతో అన్నయ్యపై విమర్శలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనైనా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు.

చిరంజీవి కూడా తమ్ముడికి ఫోన్ చేసి రాజకీయ పార్టీ స్థాపన ఆలోచనను విరమించుకోవాలని అడిగినట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టే ముందు కాస్తా ఆలోచన చేయాలని, వెనకా ముందులు చూసుకోవాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అన్నయ్య సూచనను ఆయన ఏ విధంగా తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది.
రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకు వేర్వేరు కమిటీలు వేయడానికి కాంగ్రెసు అధిష్టానం కసరత్తు ప్రారంభించి పూర్తి చేసింది. సీమాంధ్రకు మూడు కమిటీలు, తెలంగాణకు మూడు కమిటీలు వేయాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, వాయలార్ రవి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.
కాగా, సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను నియమిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా రాయలసీమకు చెందిన రఘువీరా రెడ్డిని వేశారు. సీమాంధ్రకు చెందిన చిరంజీవిని ప్రచార సారథిగా నియమించింది. కమిటీల ఏర్పాటులో ప్రాంత, సామాజిక వర్గ సమతుల్యతను పాటించడానికి ఆ పనిచేసినట్లు చెబుతున్నారు. సీమాంద్ర ఎన్నికల ప్రణాళిక కమిటీ సారథిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియమితులయ్యారు.
ఇదిలావుంటే, తెలంగాణ పిసిసి చీఫ్‌గా బీసి నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను వేశారు. మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, దళిత నేత దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రచార సారథిగా వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications