రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ: పొలిటికల్ రీఎంట్రీపై తేల్చేసిన మెగాస్టార్
అమరావతి: టాలీవుడ్‌లో మచ్ అవైటెడ్ మూవీ.. గాడ్‌ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, సముద్రఖని, సత్యదేవ్.. నటించిన ఈ మూవీ దసరా పండగను పురస్కరించరుకుని అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. మోహన్ లాల్ పాత్రను మెగాస్టార్ పోషించారు. రామ్‌చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. మోహన్ రాజా దర్శకుడు.

పొలిటికల్ థ్రిల్లర్‌గా..
ఇదో పొలిటికల్ థ్రిల్లర్. ప్లాట్ మొత్తం రాజకీయాల చుట్టే తిరుగుతుంది. సమకాలీన రాజకీయ అంశాలను ఇందులో చిత్రీకరించారు. సుమారు 175 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిందీ మూవీ. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య ది గ్రేట్ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చిరంజీవి-రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించినప్పటికీ సినిమాను ఆదరించలేదు అభిమానులు.

గాడ్ ఫాదర్‌పై అంచనాలు..
ఆచార్య డిజప్పాయింట్ చేయడంతో గాడ్‌ఫాదర్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కడం, మలయాళంలో సూపర్ హిట్ కావడం వంటి అంశాలు- ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చేశాయి. ఆచార్య తరహాలో ప్రేక్షకులను నిరాశపర్చకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాను తీశామని, ఫ్యాన్స్ తన నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయంటూ ఇదివరకే చిరంజీవి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ పరిస్థితుల మధ్య తాజాగా చిరంజీవి కొద్దిసేపటి కిందటే రిలీజ్ చేసిన ఓ డైలాగ్.. సినిమా సత్తాను చాటుతోంది. అదే సమయంలో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపైనా డిబేట్ మొదలయ్యేలా చేసింది. జస్ట్- 10 సెకెండ్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వాయిస్ నోట్.. సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తోంది. పోస్ట్ అయిన వెంటనే వైరల్‌గా మారింది. ఇందులో బేస్ వాయిస్‌తో మెగాస్టార్ పలికిన డైలాగ్- అటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

రాజకీయాలు దూరం కాలేదు..
నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు.. అంటూ రెండే రెండు డైలాగ్స్‌తో కూడిన ఈ వాయిస్ నోట్- ఎన్నో అంచనాలకు తెర తీసింది. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల నాటికి చిరంజీవి పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేస్తారనే అభిప్రాయాలు అప్పుడే మొదలయ్యాయి కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అలాగే బీజేపీ-జనసేనలనూ విమర్శించిన సందర్భాలు లేవు.

పీఆర్పీ పేరుతో..
గతంలో చిరంజీవి- ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీని తెరమీదికి తీసుకొచ్చారు. 2009 నాటి ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను గెలవగలిగారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో- ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి. అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు చిరంజీవి.












Click it and Unblock the Notifications