కుప్పంపై దృష్టిపెడితే మిగతావి పోయేలా ఉన్నాయే??
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంపైనే ఎక్కువగా దృష్టిసారించింది. కుప్పంలో చంద్రబాబును ఓడించగలిగితే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీని ఓడించడం సులభమవుతుందని, చంద్రబాబు కుప్పంమీదే ఎక్కువగా దృష్టిపెట్టేలా చేస్తే ఇతర నియోజకవర్గాలపై ఆయన ఏకాగ్రత చెదురుతుందని, అది తమ గెలుపునకు ఉపయోపడుతుందని వైసీపీ భావిస్తోంది.

దూకుడైన రాజకీయం చేస్తున్న పెద్దిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లా బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ గెలుచుకునేందుకు పావులు కదిపి విజయంతమయ్యారు. దృష్టి మొత్తం కుప్పంపై పెట్టడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం కొన్ని నియోజకవర్గాల్లో బలపడుతున్నట్లు తేలింది. తిరుపతి, మదనపల్లి, పీలేరు, నగరి, పలమనేరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, ముందు అక్కడ పార్టీని బలహీనపరిచే చర్యలను ప్రారంభిస్తేనే విజయం దక్కుతుందని పార్టీ భావించడంతో ఆమేరకు మంత్రి పెద్దిరెడ్డి దూకుడుగా రాజకీయం చేయడం ప్రారంభించారు.

పీలేరులో పూర్తి పట్టు దొరకాలి..
జిల్లాపై పూర్తిస్థాయిలో పట్టు దొరికేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా నల్లారి కుటుంబం చేతిలో ఉన్న పీలేరు నియోజకవర్గంపై దృష్టిసారించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పటినుంచే పెద్దిరెడ్డికి, నల్లారి వర్గానికి విభేదాలున్నాయి. ఇప్పుడు పీలేరు బాధ్యతలను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. అయితే అక్కడ ఆయన గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయనే సమాచారం రావడంతో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డిని వైసీపీలోకి తెచ్చారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ నాయకులను కూడా వైసీపీలోకి తెచ్చారు. అయినప్పటికీ తమకు సంస్థాగతంగా బలం ఉందని, నాయకులు వెళ్లినంతనే కార్యకర్తలను బలహీనపరచలేరని ఒక కార్యక్రమంలో కిషోర్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

జిల్లా మొత్తం కుప్పం వ్యూహమే..
కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా అయితే గెలుపొందామో అలాగే గెలుపొందేందుకు అక్కడ రూపొందించిన వ్యూహాలను అన్ని నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి అమలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో స్థానికంగా బలమైన నాయకులను, మండలాలవారీగా బలమైన నాయకులను గుర్తించి వారిని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. నాయకుల బలం తగ్గడంవల్ల ఎన్నికల సమయానికి ఓటింగ్ తగ్గుతుందని, దీన్ని అన్ని నియోజకవర్గాలకు వర్తింపచేయగలిగితే రానున్న ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని సీట్లను సులువుగా గెలుచుకోగలమని పెద్దిరెడ్డి భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications