పార్లమెంట్ కు వీరపాండ్య కట్ట బొమ్మన్.. కేంద్రంపై వింత నిరసన
ఢిల్లీ : చిత్ర విచిత్ర వేషాలతో ఆందోళనలకు దిగుతుంటారు చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్. కేంద్రం తీరుపై నిరసన గళం వినిపిస్తుంటారు. ఆక్రమంలో బుధవారం మరో కొత్త అవతారమెత్తారు. వీరపాండ్య కట్ట బొమ్మన్ వేషాధారణతో పార్లమెంట్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలో భాగంగా శివప్రసాద్ ఈ అవతారమెత్తారు.
ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ అపజయం ఖాయమని వ్యాఖ్యానించారు. పాటలు పాడుతూ, ఛలోక్తులు విసురుతూ కొత్త గెటప్ లో తనదైన శైలితో మోడీని టార్గెట్ చేశారు శివప్రసాద్.

"రాజధానికి నిధులివ్వమంటే నీళ్లు మొహాన కొట్టావు".. "వైజాగ్ రైల్వే జోన్ ఎవడబ్బ సొత్తు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటించకపోవడం నీ అహంకారానికి గుర్తు" అంటూ సెటైర్ల మీద సెటైర్లు వేశారు.
ఆయా సందర్భాలను బట్టి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషాధారణతో నిరసనలు తెలుపుతుంటారు. మంగళవారం నాడు పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో జానపద సుప్రసిద్ధుడు వంగపండు అవతారమెత్తారు. గతంలో ఎన్టీఆర్, కృష్ణుడు, కాటికాపరి లాంటి చాలా వేషాలతో దర్శనమిచ్చారు.












Click it and Unblock the Notifications