పట్టు బిగిస్తున్న సీఐడీ - చంద్రబాబు ముందున్న మార్గం ఏంటి..!!
టీడీపీ అధినేతను సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో చంద్రబాబు(Chandra Babu)ను అరెస్ట్ చేసిన సీఐడీ పెండింగ్ కేసులను తెర మీదకు తెస్తోంది. ఈ సమయంలోనే హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు(High Court) తోసిపుచ్చింది. అటు ఏసీబీ కోర్టు(ACB Court) చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో..ఇప్పుడు న్యాయ పరంగా చిక్కుల్లో చంద్రబాబు ముందున్న మార్గాలేంటి. చంద్రబాబు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
సీడీఐ వాదనలతో : చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో సీఐడీ(CID) ఇప్పటి వరకు పట్టి బిగించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఏసీబీ కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు సీఐడీ రాజమండ్రి జైలులోనే చంద్రబాబును విచారించనుంది.చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఏసీబీ కోర్టులో సీఐడీ ప్రవేశ పెట్టింది. రిమాండ్ రిపోర్టు పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీం న్యాయవాది లూధ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుధాకర్ రెడ్డి తమ వాదనలు కోర్టు ముందుంచారు. ఆ సమయంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకు చంద్రబాబు(Chandra Babu) ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు రిమాండ్ ను మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు నిర్ణయించింది. ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టి వేయటంతో చంద్రబాబు తదుపరి అడుగులపై ఉత్కంఠ పెరుగుతోంది.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు : అటు ఏసీబీ కోర్టులో వరుసగా చంద్రబాబు విచారణకు అనుమతి కోరుతూ పెండింగ్ కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. వీటి పైన చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్(Bail) కోసం దరఖాస్తు చేసారు. వీటి పైన విచారణ జరగాల్సి ఉంది. ఇటు చంద్రబాబు బెయిల్ పిటీషన్(Bail Petition) పైన ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఈ సమయంలో క్వాష్ పిటీషన్ ద్వారా మొత్తంగా తన పైన అభియోగాలను కొట్టేసేలా చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కానీ, హైకోర్టు పిటీషన్ తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది. దీంతో, చంద్రబాబు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అక్కడ ఎస్ఎల్పీ దాఖలు చేసి కేసు విచారణ పైన స్టే కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సీఐడీ సుప్రీం కేవియట్ దాఖలుకు అవకాశం ఉందని తెలుస్తోంది.
సుప్రీంకు టీడీపీ : చంద్రబాబు రిమాండ్ ను చాలెంజ్ చేస్తూ వేసిన రివ్యూ పిటిషన్ తో పాటుగా క్వాష్ పిటిషన్(Squash Petition) ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలతో కోర్టు ఏకీభవించినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ 140 మందిని విచారించింది. ఇంత విచారణ జరిగిన తరువాత విచారణ ఆపమని తాము చెప్పలేమని క్వాష్ పిటీషన్ తీర్పు కాపీలో న్యాయస్థానం పేర్కొంది. దీంతో, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తీర్పులో హైకోర్టు(High Court) ప్రస్తావించిన అంశాలతో సుప్రీంలో ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందనే దాని పైన చంద్రబాబు..ఇటు సీఐడీ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పైన సోమవారం విచారణ జరగనుండటంతో..ఆ రోజు కోర్టు తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications