టీడీపీలో చేరిన హీరో నిఖిల్!
అమరావతి: సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయా పార్టీలలో వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నేత నారా లోకేష్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిఖిల్ టీడీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ తరపున నిఖిల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్‌కు నిఖిల్ దగ్గరి బంధువు. కొండయ్య యాదవ్‌కు నిఖిల్ అల్లుడు వరుస అవుతారు. పార్టీలో చేరిన సందర్భంగా నిఖిల్ ట్విటర్ వేదికగా స్పందించారు.

'చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందినందుకు మావయ్య ఎమ్ఎమ్ కొండయ్య యాదవ్‌కు అభినందనలు, అలాగే ధన్యవాదాలు. మా కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని, మీ అందరి ఆశీస్సులు మామయ్యకు కావాలి' అని కోరారు నిఖిల్. దీంతో నారా లోకేశ్‌తో నిఖిల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో టీడీపీ అభిమానులు, శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ కు అండగా ఎన్నికల ప్రచారంలో చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదో ఎదురు చూడాలి త్వరలోనే తేలిపోనుంది.
అయితే, నిఖిల్ టీం మాత్రం ఆయన టీడీపీలో చేరలేదని, ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఉంటానని చెప్పేందుకే పసుపు కండువా కప్పుకున్నారని చెప్పడం గమనార్హం. మరోవైపు, నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం 'స్వయంభు' చిత్రంలో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్. మరోవైపు, దర్శకుడు చందు మొండేటి 'కార్తీకేయ 3'ని ప్రకటించారు.












Click it and Unblock the Notifications