సార్వత్రిక పోలింగ్ ను తలపించిన స్థానిక పోరు - పలు చోట్ల ఘర్షణలు : కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు..!!
ఏపీలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికలను తలపించే తరహాలో ప్రధాన పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికలు సైతం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ రోజున నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగిందిది. మొత్తం 353 స్థానాల్లో 28 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతావాటికి పోలింగ్ నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఇప్పటికీ క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

ఫిర్యాదులు.. తోపులాటలు
మొత్తం 8 లక్షల 62వేల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని స్థానాలకు కలిపి 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే, కుప్పంలో తొలి నుంచి టీడీపీ..వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో అక్కడ పోలింగ్ ముందు నుంచే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బయట వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కుప్పంలో బయట వ్యక్తులు వచ్చారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన మహిళలను ఎక్కడ నుంచి వచ్చారంటూ ప్రశ్నించారు.

దొంగ ఓటర్లను తెచ్చారంటూ ఆరోపణలు
దొంగ ఓటర్లను పట్టించి ఇచ్చినా..పోలీసులు పట్టించుకోవటం లేదంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేసారు. మొత్తం 24 వార్డులు ఉన్న కుప్పంలో హోరా హోరీ గా సాగిన పోరులో గెలిచేందుకు రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేసాయి. ఇక, నెల్లూరులోనూ అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజంపేటలో పోలీసులకు - టీడీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. విశాఖలో జనసేన - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి అవంతి శ్రీనివాస్...ఎంపీ విజయ సాయి రెడ్డి సమక్షంలోనే రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు.

కుప్పంలో తొలి నుంచి ఉద్రిక్తత
పోలీసులు వారిని వారించి అక్కడ నుంచి పంపేసారు. ఇక, కమలాపురంలోనూ దొంగ ఓట్ల ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలు బయట నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన కు దిగాయి, టీడీపీ - వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పల్నాడులోని దాచేపల్లి..గురజాల మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడా ఘర్షణలు జరిగాయి. కుప్పంలో ఉదయం నుంచి దొంగ ఓటర్లను పట్టుకొనేందుకు టీడీపీ నేతలు ఛేజింగ్ చేసారు. అనేక చోట్ల వైసీపీ - టీడీపీ శ్రేణుల మధ్య భారీగా నినాదాలు చేస్తూ ఒకరి పైకి మరొకరు దూసుకెళ్లే ప్రయత్నాలు చేసారు. అయితే, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.
Recommended Video

17న ఓట్ల లెక్కింపు
గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడి నేతలు అక్కడే తమ నియోజకవర్గాల్లో ఎన్నికలకు పరిమితమయ్యారు. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన పార్టీలు రెండు తమ శక్తి యుక్తులను ప్రదర్శించాయి. ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో సై అంటే సై అనే విధంగా వ్యవహరించాయి. రేపు (మంగళవారం) జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17న ఈ రోజు జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు జరగనుంది. కుప్పంలో ఎన్నికల తీరు పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల తప్పు బట్టారు. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొడుతున్నామని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications