రైతుల ఖాతాల్లో రూ 20 వేలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు ముహూర్తం ఖరారు చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ రైతు ఖాతాలో రూ 20 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఈ నెలతో మొదలైన ఆర్దిక సంవత్సరంలో అమలు దిశగా బడ్జెట్ లో నిధులు కేటాయించింది. ఇప్పుడు ఈ పథకం అమల్లో భాగంగా రైతు ఖాతాలో నిధుల జమ గురించి ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. దీంతో పాటుగా తల్లికి వందనం పథకం అమలు గురించీ మరోసారి వెల్లడించారు.
తల్లికి వందనం పై
ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలు పైన ప్రకటన చేసారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4వేలకు పెంచి అమలు చేస్తున్న అంశాన్ని గుర్తు చేసారు. రూ.64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి రూ.10 వేలు, రూ.15 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడ్డా రంటే డ్వాక్రా సంఘాలే కారణమని, త్వరలో తల్లికి వందనం కింద ఆర్థిక సాయం చేస్తామని పేర్కొ న్నారు. వచ్చే నెలలో ఈ పథకం ప్రతీ బడికి వెళ్లే విద్యార్థి తల్లి ఖాతాలో నిధులు జమ చేయను న్నారు. బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులను కేటాయించారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పథకం అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

రైతుల ఖాతాల్లో రూ 20 వేలు
అదే సమయంలో ఉద్యోగాల్లో 33, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, జిల్లాల వారీగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనకబడిన వర్గాల సంక్షేమమే అని చెప్పారు. ఈ ఏడాది లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యమని, రైతులకు అండగా ఉంటామని, వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని అన్నారు. మే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమల్లో భాగంగా నిధులు జమ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే ఈ పధకాన్ని కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే నెలలో నిధుల జమ
అన్నదాత సుఖీభవ పథకం లో భాగంగా అర్హత ఉన్న ప్రతీ రైతు ఖాతాలో మూడు విడతలుగా రూ 20 వేలు జమ కానున్నాయి. పీఎం కిసాన్ ప్రతీ ఏటా మూడు విడతలుగా రూ 2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. వాటితో పాటుగా రూ 5 వేలు చొప్పున రెండు సార్లు, మూడో సారి రూ 4 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. పీఎం కిసాన్ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి. ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్ లో ఇందు కోసం రూ 9,400 కోట్లు ప్రతిపాదించింది. అయితే, కౌలు రైతులకు ఈ పథకం అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. పధకం అమల్లో భాగంగా అర్హతలు. .మార్గదర్శకాల పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో నే వీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. తొలి విడత వచ్చే నెల విడుదల చేసేలా ప్రణాళిక లు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications