మారుతున్న ప్రజల మూడ్ - చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!
ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలు పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి సహకరించటం లేదు. ఇప్పటికే అప్పులు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, ఢిల్లీలో భారీగా సంక్షేమ పథకాలు అందించిన పార్టీలనే ప్రజలు ఓడించారు. దీంతో, పబ్లిక్ మూడ్ ఎలా ఉందనే అంశం పై చంద్రబాబు ఫోకస్ చేసారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.
బడ్జెట్ సమావేశాలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓట్ ఆన్ అకౌంట్ , జూలైలో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లు ప్రవేశ పెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్దిక సంవత్సరం 2025 - 26 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఈ నెల 28న ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. జూన్ లో ప్రభుత్వం ఏర్పాటు తరువాత సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ పథ కం అమల్లోకి తెచ్చారు. మిగిలిన పథకాలు వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలుకు నిర్ణయించారు.

మారుతున్న లెక్కలు
ఇందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పైన కసరత్తు జరుగుతోంది. ప్రతీ మహిళకు నెలకు రూ 1500 హామీ అమలు పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే, పథకాల నిర్వహణ చేయాలంటే ఉన్న ఆర్దిక ఇబ్బందులను చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏపీలో జగన్ పూర్తిగా సంక్షేమ పథకాల కోసమే భారీగా నిధులు ఖర్చు చేసారు. తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో కేజ్రీవాల్ సైతం ఇదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగించారు. కానీ, ఈ ముగ్గురు ఎన్నికల్లో ఓడిపోయారు. అంతగా పథకాలు అమలు చేసిన జగన్ ను ఓడించిన తరువాత.. సంక్షేమ పథకాల కోసం ఈ స్థాయిలో ఖర్చు అవసరమా అనే చర్చ రాజకీయంగా మొదలైంది.
కసరత్తు
కానీ, ఇదే సమయంలో చంద్రబాబు పథకాల అమలు కష్టమైనా రాజకీయంగా తప్పదనే నిర్ణయాని కి వచ్చినట్లు తెలుస్తోంది. నాడు హామీల అమలులో పవన్ సైతం బాధ్యత తీసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ సైతం భారీగా సంక్షేమ పథకాలకు హామీ ఇచ్చిన అంశాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే జగన్ కు రాజకీయంగా వెంటాడే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో, సంక్షేమం దశల వారీగా అమలు చేస్తూ.. అదే సమయంలో అభివృ ద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే చర్చ సాగుతోంది. అయితే, ఆర్దికంగా ఉన్న ఇబ్బందులు సమస్యగా మారుతున్నాయి. దీంతో, ఈ సారి ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్ లో కేటాయింపులు ఏ విధంగా ఉంటాయనేది.. రాజకీయంగా రాష్ట్రంలో ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications