రాజ్యసభ సీట్లపై తేల్చేసిన చంద్రబాబు - బీజేపీకి బిగ్ ట్విస్ట్..!!
రాజ్యసభ సీట్ల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు నాలుగు ఖాళీలు అవుతున్నాయి. ఈ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కూటమికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం మేరకు నాలుగు స్థానాలు వీరికే దక్కటం లాంఛనమే. కాగా.. ఈ సీట్లు మూడు పార్టీలు షేర్ చేసుకుంటాయని చెబుతూ వచ్చారు. కాగా, తాజాగా సీఎం చంద్రబాబు ఈ సీట్ల పంపకాల పైన తేల్చేసినట్లు తెలుస్తోంది. బీజేపీకి ఈ సారి అవకాశం ఇవ్వలేమని చెప్పినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
జూన్ 21న రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీటికి భారీ పోటీ నెలకొంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీ, జనసేనకు ఎన్ని కేటాయిస్తారో స్పష్టత రావలసి ఉంది. వైసీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేశారు. మస్తాన్‌రావు, మోపిదేవి టీడీపీలో చేరగా.. తెలంగాణకు చెందిన కృష్ణయ్య బీజేపీలో చేరారు. మస్తాన్‌రావును టీడీపీ నాయకత్వం తిరిగి రాజ్యసభకు పంపింది.

మోపిదేవి బదులు సానా సతీశ్‌కు అవకాశం ఇచ్చింది. బీజేపీ కృష్ణయ్యను మళ్లీ నామినేట్ చేసింది. 2025లో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని సీఎం చంద్రబాబు బీజేపీకి ఇచ్చారు. పాకా సత్యనారాయణను ఆ పార్టీ నామినేట్ చేసింది. ఇప్పటివరకు రెండు స్థానాలను బీజేపీకి ఇచ్చినట్లయింది. దరిమిలా ఆ పార్టీకి ఇప్పుడు ఇవ్వకుండా.. జనసేనకు ఒకటి కేటాయించి మూడు స్థానాలను టీడీపీ తీసుకోవాలని భావిస్తోంది.
బీజేపీకి ఈ సారి అవకాశం ఇవ్వలేం..!
తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రాజ్యసభ సీట్ల పైనా చర్చ జరిగింది. సీట్ల కోసం టీడీపీలోనే పోటీ తీవ్రంగా ఉందని.. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని మాధవ్ కు సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. తమ పార్టీకి రాజ్యసభ నాలుగు స్థానాల్లో ఒకటి ఇవ్వాలని ప్రతిపాదించగా.. ఈ సారి సాధ్యం కాదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. జాతీయ సమీకరణాలు... కీలక బిల్లుల ఆమోదం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకత్వానికి రాజ్యసభ సీట్లు అవసరంగా మారింది. దీంతో.. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ తిరిగి చంద్రబాబుతో సంప్రదింపులు చేసే అవకాశం ఉంది.
ఒకవేళ బీజేపీ నుంచి ఒత్తిడి వస్తే వారికి ఒకటి కేటాయించక తప్పదు. ఆ స్థానం నుంచి ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. అందులో మంద క్రిష్ణ మాదిగ.. తమిళనాడు నేత అన్నామలై పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వచ్చే వారం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీ నుంచి కొత్తగా మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో.. చివరి నిమిషంలో బీజేపీకి రాజ్యసభ సీటు కేటాయించాల్సి వస్తే.. చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications