పెన్షన్ల రద్దు చర్చ వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల అమలును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అనర్హుల విషయంలో అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారి వివరాలను జిల్లాల వారీగా నివేదికలు అందాయి. వారికి పెన్షన్ల కోత పైన చర్చ జరుగుతోంది. దీంతో, ఈ అంశం పైన ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. పింఛన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అర్హత లేని వారి పెన్షన్ల తొలిగింపు పైన చర్చ జరుగుతోంది. పెద్ద సంఖ్యలో దివ్యాంగ పెన్షన్లు తెలిగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పింఛన్లు పొందుతున్న వారిపై ఇటీవల జరిపిన పునఃపరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి జిల్లాల వారీగా లెక్కలు వివరించారు. ఈ ప్రక్రియలో అనర్హులను గుర్తించినట్లు చెప్పారు. అన్ని విధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి.. ఎలాంటి వైకల్యం లేకుండానే కొంత మంది దివ్యాంగ పింఛన్లు పొందుతున్నట్లు పరిశీలనలో తేలినట్లు నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనర్హులను ధ్రువీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి, పింఛన్ అనర్హులను నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు.

దీంతో, సీఎం చంద్రబాబు అధికారులకు పెన్షన్ల కోత.. కొనసాగింపు పైన స్పష్టత ఇచ్చారు. నకిలీ పింఛన్లు మాత్రమే తొలగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ వ్యక్తికి పింఛన్ రద్దు కాకూడదని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న పింఛన్లన్నీ యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేసారు. అలాగే తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పింఛన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు. దీంతో, అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పెన్షన్ కోత పడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అర్హత లేని వారి విషయంలో మాత్రం నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. వచ్చే నెల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తున్నారు. అర్హులు ఎవరికీ పెన్షన్లు ఆగవని స్పష్టత ఇచ్చారు. అర్హత ఉన్న వారికి ఎవరికైనా పెన్షన్ రద్దు అయితే, రీ వెరిఫికేషన్ కోరే అవకాశం కల్పిస్తూ.. సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications