అమరావతి రైతుల కోసం చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక నేరుగా..!!
అమరావతి కేంద్రంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు కొద్ది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. సీఎం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశమై..కీలక నిర్ణయాలు వెల్లడించింది. కాగా.. ఇప్పడు చంద్రబాబు నేరుగా రైతులతో సమావేశం కావాలని నిర్ణయించారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా చంద్రబాబు హామీ ఇవ్వనున్నారు. 2024 లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తొలి సారి నిర్వహిస్తున్న ఈ భేటీ పైన ఆసక్తి నెలకొంది.
అమరావతి రైతులతో ఈ సాయంత్రం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటి కే చంద్రబాబు సూచించారు. సీఆర్డీఏ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. వారికి ఏమైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించాలని సీఆర్డీఏ, పురపాలక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలో వారితో సమావేశమై ఇబ్బందులు తెలుసుకోవాలని పురపాలక శాఖ మంత్రికి, అధికారులకు స్పష్టం చేశారు.

అయితే.. ముఖ్యమంత్రి తానే స్వయంగా రైతులతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. అపరిష్కృతంగా ఏమైనా అంశాలు ఉంటే వాటిని కేబినెట్ ముందు ఉంచాలని సీఎం ఆదేశించారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని సూచించారు. నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు. తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో జరిగిన సమవేశంలో రైతుల సమస్యలపై చర్చించారు.
జరిబు భూముల సమస్యల విషయంలో నిజమైన జరిబు రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ పైన చంద్రబాబు తమ విధానం వెల్లడించే అవకాశం ఉంది. గ్రామ కంఠాల సమస్య పైనా రైతులు పలు అంశాలను ప్రస్తావించారు. దీని పైన చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో అమ్ముకునే అవకాశం ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వ నిర్ణయంతో సమస్యలు రావటంతో.. ఇప్పుడు పరిష్కారం దిశగా రైతులు ప్రభుత్వం నుంచి హామీ కోరుతున్నారు.

అదే సమయంలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల అంశంలోనూ నిర్దిష్ట కాల పరిమితి పైన చంద్రబాబు హామీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాల కు డీపీఆర్ పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. 2026 జూన్ నాటికి గ్రామాల్లో మౌలికవసతులను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజధాని నిర్మాణా ల పైన ప్రభుత్వ ప్రణాళికలను వివరించటంతో పాటుగా రైతుల కు చంద్రబాబు ఇచ్చే హామీల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications