శ్రీశైలం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ -తిరుమల తరహాలో..!!
మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా శ్రీశైలం ఆలయ అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తిరుమల తరహాలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి 2 వేల హెక్టార్ల అటవీ భూమి కేటాయించేలా కేంద్రానికి లేక రాయాలని నిర్ణయించింది. రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని మోదీతో ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ఈ మేరకు తాజా సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
శ్రీశైలం దేవాలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసారు. ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం ఆలయం దర్శించనున్నారు. ఈ క్రమంలో చేసిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ, అటవీశాఖ అధికారులతో సీఎం చర్చించారు. జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధి పై సీఎం చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించు కొనేందుకు శ్రీశైలం రానున్న దృష్ట్యా ఆయనతో ఆలయ అభివృద్ధిపై చర్చించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం సూచించారు. డోర్నాల, సుండిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల సమీపంలో ఉన్న జాతీయ రహదారులను దేవాలయానికి కనెక్టు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్ర అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా భక్తులకు విస్తృతమైన సౌకర్యాలను కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications