ప్రత్యేక సహకారం అందించండి - కేంద్రానికి చంద్రబాబు వినతి..!!
ఏపీలో ఆక్వా, రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు ముగ్గురు కేంద్రమంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్ర ఆక్వా కల్చర్, మత్స్య, పొగాకు రంగాల అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం అందించాలని కోరారు. ఆక్వా రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం తో పాటు బ్లూ ఎకానమీ బలోపేతానికి పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు. అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం అవసరమని లేఖలో తెలిపారు. డీజీఎఫ్‌టీ ద్వారా ఫిష్ మీల్ ఎగుమతిని నియంత్రించాలని సూచించారు. ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలని కోరారు. ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించాలని కోరారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీఈ) ద్వారా ఫిష్ మీల్ ఎగుమతులను క్రమబద్ధీకరించాలని, బ్లూ ఎకానమీకి మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. అలాగే 'నిర్యాత్ ప్రోత్సాహన్' పథకాన్ని ఈ రంగానికి వర్తింపజేయాలని సూచించారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ..
ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీని తగ్గించాలని సీఎం లేఖలో విజ్ఞప్తి చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు కింద రైతులకు ప్రస్తుతం ఉన్న పరిమితికి అదనంగా రూ.5 లక్షల టాప్-అప్ రుణ సౌకర్యం కల్పించాలని కూడా కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోరారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో ఉండవల్లిలోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయిన చంద్రబాబు.. ఈ సమస్యలను ప్రస్తావించారు. కేంద్రం సహకరించాలని కోరారు. ఇప్పుడు నేరుగా కేంద్రానికి ప్రస్తుత సమస్యను వివరిస్తూ లేఖలు రాసారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications