చిన్నారి కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓ చిన్నారి కోరిక తీర్చారు. గత గురువారం నాడు గురు పౌర్ణమి సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు 'వనరులు' అనే పాఠాన్ని కూడా బోధించారు. అంతకు ముందు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సీఎం ముచ్చటించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి.. హాజరు, మార్కుల వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. పాఠశాల అభివృద్ధిపై వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.

ఈ క్రమంలోనే ఓ చిన్నారి కుటుంబంతో చంద్రబాబు మాట్లాడి.. ప్రభుత్వ పథకాల అమలు గురించి ఆరా తీశారు. అయితే సదరు కుటుంబ సభ్యులు తమ ప్రస్తుత పరిస్థితి గురించి, స్కీమ్ ల గురించి చెప్పారు. అప్పుడే ఆ చిన్నారి సైతం తన కోరికను ముఖ్యమంత్రి ఎదుట బయటపెట్టింది. దాంతో వెంటనే అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. కుటుంబంలోని నలుగురుతో ముచ్చటించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. తమకు సొంత ఇల్లు లేదని అద్దె ఇంట్లో ఉన్నామని చిన్నారి తల్లి వాపోయింది. అలానే బాలిక కూడా సైకిల్ కావాలని అడిగింది. దీంతో వెంటనే సైకిళ్లు అందించాలని సీఎం ఆదేశించడం.. ఆ మరుసటి రోజే ఆ చిన్నారులు నలుగురికి సైకిళ్లు అందించడం చకచకా జరిగిపోయింది. దీంతో చంద్రబాబు మరోసారి మంచి మనసు చాటుకున్నారు అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో 2.28 కోట్ల మంది పాల్గొన్నారు. ఒకే రోజున రెండు కోట్ల మంది తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు సమావేశమయ్యే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రభుత్వం అరుదైన రికార్డు నెలకొల్పింది.












Click it and Unblock the Notifications