ఇంకో రెండున్నరేళ్లు ముందుకు..
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై దృష్టి సారించింది. రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది.
ఈ క్రమంలో- చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు ఉంటారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అక్కడికక్కడే సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటివరకు జరిగిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు.

ఈ ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హెలీకాఫ్టర్‌లో పోలవరానికి బయలుదేరి వెళ్తారు. 10: 45 నిమిషాలకు ప్రాజెక్టుకు చేరుకుంటారు. అనంతరం హిల్ వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ పనులను వీక్షిస్తారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులను పరిశీలిస్తారు. అనంతరం 3 గంటల వరకు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. 3:10 నిమిషాలకు తిరుగు ప్రయాణమౌతారు.
చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి కూడా. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
2019 నుంచి 2024 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగా నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుందని నిమ్మల రామానాయుడు అన్నారు. ఫలితంగా 50,000 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 12,157 కోట్ల రూపాయల మేర నిధులు సాధించామని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేపీఎస్ కిశోర్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రే హౌండ్స్ బలగాలు, యాంటీ నక్సల్స్ స్వాడ్ దళాలను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications