జీవో నెం 3 పునరుద్దనపై భేటీ.. వంద శాతం ఛాన్స్ వారికే ?
ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 3 జారీ చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు.
అయితే 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను రద్దు చేసిన విషయం తెలిపారు. గత ప్రభుత్వం ఈ విషయంలో సమీక్ష పిటిషన్ వేయడంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. దాంతో గిరిజనులు ఈ జీవో ద్వారా లభించే ప్రయోజనాలను కోల్పోయారన్నారు. జీవో 3 పునరుద్ధరణకు న్యాయపరంగా ఉన్న అవకాశాలు, అడ్డంకులపై అధికారులతో సీఎం చర్చించారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు, వారిని మళ్లీ ఆ లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇందులో భాగంగా గిరిజనులు, సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే, సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు సాగాలన్నారు. అయితే అధికారులు సీఎం చంద్రబాబుకు మూడు ఆప్షన్స్ వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు కొనసాగించడం.. గిరిజన జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50% మించకుండా రిజర్వేషన్లు ఇచ్చి హక్కులు కాపాడడమనీ స్పష్టం చేశారు.
దీనిపై సీఎం స్పందిస్తూ.. గిరిజనుల హక్కులకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. ఏ ఒక్క అవకాశం అయినా వదులుకోకుండా న్యాయం చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. విద్య, వైద్యం లాంటి రంగాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications