నియోజకవర్గానికి రూ.కోటి నిధులు ఇస్తామని చంద్రబాబు తీపికబురు.. వెంటనే ఆ పని చెయ్యాలని ఆదేశం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున నిధులు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిధుల ద్వారా ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూర్చాలని, ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చాలని పార్టీ నేతలను ఆదేశించారు.
తన మొత్తం దృష్టి, ఆలోచన 2029 సాధారణ ఎన్నికలపైనే ఉందన్న చంద్రబాబు
కాంక్లేవ్‌లో చంద్రబాబు మాట్లాడుతూ తన మొత్తం దృష్టి, ఆలోచన 2029 సాధారణ ఎన్నికలపైనే ఉందన్నారు. 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయం అని స్పష్టం చేశారు. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ఆ తర్వాత సాధారణ ఎన్నికలకు బలమైన పునాది వేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో 25 ప్రాధాన్యాంశాలను గుర్తించి, వాటి ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు.

ఎంపీ ల్యాడ్స్ నిధులను సమర్థంగా వినియోగించాలని చంద్రబాబు సూచన
ప్రజల మధ్య నిరంతరం ఉండి, కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తే గుర్తింపు, గౌరవం లభిస్తాయని ఆయన అన్నారు.ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధులను సమర్థంగా వినియోగించాలని, తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించాలని సూచించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన్ చిన్న సమస్యల పరిష్కారానికి నిధులు కావాలని కోరగా, సీఎం రూ.కోటి కేటాయింపుకు అంగీకరించారు.
స్వర్ణాంధ్ర విజన్-2047పై దిశానిర్దేశం
డబ్బు మాత్రమే ఎన్నికల్లో గెలుపు తీసుకురాదని, ప్రజలు, కేడర్‌తో బలమైన అనుబంధమే నిజమైన పునాది అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు స్వర్ణాంధ్ర విజన్-2047పై దిశానిర్దేశం చేస్తూ, ఎమ్మెల్యేలు దానికి నియోజకవర్గ స్థాయిలో విలువను జోడించాలని అన్నారు. విజన్ ప్లాన్ సరిగా అమలు చేస్తే అభివృద్ధితో పాటు ఎన్నికల విజయం కూడా సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
కేంద్ర మంత్రులు తమ శాఖలను పర్యవేక్షించే స్ఫూర్తితో జిల్లాల అభివృద్ధికి దృష్టి పెట్టాలని సూచించారు. మూడు నెలలకోసారి ఇలాంటి లీడర్‌షిప్ కాంక్లేవ్‌లు నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని, దుష్ప్రచారంతో ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాటిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.













Click it and Unblock the Notifications
