CM Chandrababu: ఉద్యోగులపై పని భారం తగ్గించండి
సాంకేతికత అంటే కేవలం సౌకర్యం కాదు.. అది పారదర్శకమైన, వేగవంతమైన పాలనకు ఒక శక్తివంతమైన ఆయుధం" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS)పై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పాలనా యంత్రాంగానికి సరికొత్త దిశానిర్దేశం చేశారు. 2026 సంవత్సరాన్ని 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్' (సాంకేతిక ఆధారిత నిర్ణయాల సంవత్సరం) గా ప్రకటించిన ముఖ్యమంత్రి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డేటా అనలిటిక్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సామాన్యుడి ముంగిట ఉంచడమే లక్ష్యమని వెల్లడించారు.
ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రను పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏఐని సమర్థంగా వినియోగించడం ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను (Grievances) మానవ ప్రమేయం లేకుండా, అత్యంత వేగంగా మరియు కచ్చితత్వంతో పరిష్కరించవచ్చని ఆయన తెలిపారు. పనితీరులో లోపాలున్న ఉద్యోగులకు అధునాతన శిక్షణ ఇచ్చి, నిరంతర పర్యవేక్షణ ద్వారా వారిని టెక్నాలజీ వైపు మళ్లించాలని సూచించారు.

డేటా ఆధారిత పాలన.. శాఖల మధ్య సమన్వయం
కేవలం ఫైళ్లు కదపడం మాత్రమే కాకుండా, గణాంకాల ఆధారంగా (Data-Driven) నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ మరియు అగ్నిమాపక శాఖల పనితీరును సమీక్షించిన ఆయన.. శాఖల మధ్య డేటా అనుసంధానం జరగాలని కోరారు. డేటా లేక్ (Data Lake) వ్యవస్థ ద్వారా సమాచారాన్ని విశ్లేషించి, ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
వాట్సప్ గవర్నెన్స్
పాలనను ప్రజల వేలికొనలపైకి తెచ్చిన 'మన మిత్ర - వాట్సప్ గవర్నెన్స్' అద్భుత ఫలితాలను ఇస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు 1.43 కోట్ల మంది పౌరులు వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందాగా... ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా 878 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల నుంచి మున్సిపల్ పన్నుల చెల్లింపు వరకు అన్నీ వాట్సప్‌లోనే పూర్తవుతున్నాయి. 2026 నాటికి ప్రతి పౌరుడికీ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications