పెద్దిరెడ్డి గ్రానైట్ క్వారీలపై గురి పెట్టిన సీఎం చంద్రబాబు, జారుకున్న పెద్దాయన మనుషులు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి సినిమా చూపించాలని స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సిద్దం అవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో పాటు రాయలసీమలో దాదాపుగా అన్ని జిల్లాలో తిరుగేలేని నాయకుడిగా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద ఇప్పుడు తిరుబాటు మొదలైయ్యింది.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజక వర్గం పుంగనూరులోనే ఆయన మీద తిరుబాటు మొదలుకావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతకాలం సొంత కంపెనీతో నడిపిన క్వారీల నుంచి పెద్దిరెడ్డి అనుచరులు చిన్నగా జారుకున్నారని వెలుగు చూసింది. గత ఐదు సంవత్సరాల్లో ఒక్కపైసా ఎవ్వరికి చెల్లించకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి క్వారీల్లో కంకర అమ్ముకున్నారని ఆరోపణలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

పుంగనూరు నియోజక వర్గంలోని పాలెంపల్లిలో చాలా నాణ్యమైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. 2014-2019 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు వ్యాపారులు గ్రానైట్ క్వారీల లీజులు ఇవ్వాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి అర్జీలు సమర్పించుకున్నారు. తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మంత్రి అయ్యారు.
పెద్దిరెడ్డి మంత్రి అయిన తరువాత పాలెంపల్లిలో గ్రానైట్ లీజుల కోసం అర్జీలు పెట్టుకున్న వాళ్లకు అనుమతులు దక్కలేదు. జగన్ సీఎం కావడం, పెద్దిరెడ్డి మంత్రి కావడంతో వారికి అనుకూలంగా ఉన్న వాళ్లు తప్పా మిగతా వాళ్లు ఎవ్వరూ పాలెంపల్లిలోని గ్రానైట్ జోలికి వెళ్లే పరిస్థితులు కనిపించలేదు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ల చేతికి గ్రానైట్ లీజులు వెళ్లాయి. పాలెంపల్లిలో సుమారు 30కి పైగా క్వారీలు ఉండటంతో ఆ ప్రాంతం మీద పెద్దిరెడ్డి అనుచరుల కన్నుపడింది.
పాలెంపల్లిలోని అనేక క్వారీల్లో పెద్దిరెడ్డి అనుచరులు తిష్టవేశారు. ఇదే సమయంలో మదనపల్లె, పుంగనూరు నియోజక వర్గాల్లో టీడీపీ మద్దతుదారులుగా ముద్రపడ్డ నాయకులు వారి క్వారీల దగ్గరకు వెళ్లే సాహయం చెయ్యలేకపోయారు. కొందరు టీడీపీ నాయకులు ధైర్యం చేసి వారి క్వారీల దగ్గరకు వెళ్లారు. అయితే అప్పటికే తిరుగులేని నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి ఆ క్వారీ యజమానులకు భారీ జరిమానాల నోటీసులు పంపించి వారిని కోలుకోలేని దెబ్బ తీశారు.

ఇదే సమయంలో టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యాపారులకు చెందిన కొన్ని క్వారీలను గనుల శాఖ అధికారులు సీజ్ చేశారు. గతంలో ఇద్దరు వ్యక్తులు లీజుకు తీసుకున్న క్వారీల మీద పెద్దిరెడ్డి అనుచరుల కన్నుపడింది. అంతే రాత్రికి రాత్రి పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన టిప్పర్లు, యంత్రాలు ఆ క్వారీలోకి వచ్చేశాయి. దాదాపు ఐదు సంవత్సరాల పాటు పెద్దిరెడ్డి సంస్థకు చెందిన క్రషర్లు క్వారీలోని ముడిరాయిని కంకర చేశారు.
ఆ కంకరను పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజక వర్గాలకు తరలించి రోడ్లు వేసి కోట్ల రూపాయల బిల్లులు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి క్వారీల్లో కంకర చేసిన దానికి ఆ క్వారీల యజమానులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఒక్కరూపాయి కూడా చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తరువాత పెద్దిరెడ్డి మీద పుంగనూరులో తిరుబాటు మొదలైయ్యింది.
రానునురాను వ్యతిరేకత వ్యక్తం కావడంతో నాలుగు రోజుల క్రితం పాలెంపల్లిలోని రెండు క్వారీల్లో ఉన్న యంత్రాలు, టిప్పర్లను పెద్దిరెడ్డి అనుచరులు తీసుకుని వెళ్లిపోయారని తెలిసింది. గత ఐదు సంవత్సరాల నుంచి పగలు, రాత్రి అని తేడా లేకుండా యంత్రాలతో ముడిరాయిని కంకర చేసి విక్రయించిన పెద్దిరెడ్డి అనుచరులు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ ప్రాంతం నుంచి జారుకున్నారని వెలుగు చూసింది.
పుంగనూరు నియోజక వర్గంలోని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదీనంలో ఉన్న క్వారీలు ఇంతకాలం ప్రభుత్వానికి ఎంత సొమ్ము చెల్లించారు, ఎన్ని వేల టన్నుల కంకర తరలించారు అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆరా తీస్తోందని, త్వరలో ఆ సంస్థకు నోటీసులు పంపించే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఇంకాలం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇక్కడ కంకర చేసి వాటిని విక్రయించారని, మాకు నోటీసులు ఇవ్వకుండా ఆయనకే నోటీసులు ఇవ్వాలని ఆ క్వారీల యజమానులు అంటున్నారని తెలిసింది.
ఈ క్వారీల యజమానులు కూడా పెద్దిరెడ్డి అనుచరులు అయినా వారికి కూడా పెద్దిరెడ్డి ఒక్కరూపాయి ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే పుంగనూరు నియోజక వర్గంతో పాటు పలు చోట్ల ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన అనుచరుల క్వారీల గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారని, త్వరలోనే పెద్దాయన కంపెనీలకు నోటీసులు పంపించే అవకాశం ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications