ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: చంద్రబాబు నివాళి
Chandrababu: ఇటీవలే కన్నుమూసిన సీపీఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీ వసంత్ కుంజ్‌లో గల ఆయన నివాసానికి వెళ్లారు. పార్థివ దేహంపై పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆ సమయంలో ఆయన వెంట కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ మాజీ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ వెంటనే పార్టీ నాయకులతో కలిసి నేరుగా వసంత్ కుంజ్‌కు వెళ్లారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీతారాం ఏచూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ఓ మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయామని అన్నారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పరితపించారని, పేదల సంక్షేమం కోసం 40 సంవత్సరాల పాటు సీతారాం ఏచూరితో కలిసి పోరాడానని చెప్పారు.
అనేక ఉద్యమాల్లో ఏచూరితో కలిసి నడిచానని చంద్రబాబు చెప్పారు. సీపీఎంలో ఓ సాధారణ నాయకుడి స్థాయి నుంచి ఆ పార్టీలో అత్యున్నతమైన ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారని చంద్రబాబు అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి నాయకుడిగా, సీపీఎం నేతగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రతి అడుగులోనూ పోరాట తత్వమే కనిపించిందని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ ఆయనకు సన్నిహితులు ఉన్నారని, ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించేవారని చంద్రబాబు అన్నారు. ఎన్నోసార్లు ఆయనతో తన ఆలోచనలను పంచుకున్నానని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఏచూరీకి శత్రువులు అంటూ ఎవరూ లేరని పేర్కొన్నారు.
తీవ్ర అనారోగ్య సమస్యలతో సీతారాం ఏచూరి కిందటి నెల 19వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. న్యుమోనియా తరహా ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందుల బారిన పడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కొద్దిరోజులు వెంటిలేటర్‌పైనా ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 12వ తేదీన తుదిశ్వాస విడిచారు.












Click it and Unblock the Notifications