భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష: వాగులో చిక్కుకున్న 45 మంది సురక్షితం
అమరావతి: రాష్ట్రంలోని భారీ వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
వర్షాలు: చెట్టును పట్టుకొని.. వరద పెరగడంతో పైకెక్కాడు, హెలికాప్టర్‌తో..
సహాయచర్యల్లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా గుంటూరు జిల్లాలో వరద ఉధృతికి గల్లంతు అయిన వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. సహాయచర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని తెలిపారు.

పుష్కరాల నిర్వహణలో చూపిన గుడ్ గవర్నెన్స్ ప్రస్తుత విపత్తులోనూ అధికారులు చూపాలని ఆదేశించారు. వీలైనంతగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులకు గండ్లు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పులిచింతలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుందని దీంతో ఆ నీటిని బయటకు వదులుతున్నామని అన్నారు. గురువారం ఉదయం నుంచి గురజాల నియోజక వర్గంలో ఐదారు మండలాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, దీనివల్ల భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.
వాగులో బస్సు చిక్కుకుందని, అందులో ప్రయణీకులను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారని, అలాగే వాగులో చిక్కుకున్న ముగ్గురు యువకులను కూడా కాపాడారని చంద్రబాబు వెల్లడించారు. రెండు హెలీకాఫ్టర్లనుకూడా రంగంలోకి దించామని, ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేశామని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయని విశాఖపట్నం వాతావరణ శాఖ. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారి మళ్లించింది. కాగా, భారీ వర్షాలకు గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని వూటుకూరు వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వారిని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను అప్రమత్తం చేయడంతో చివరికి కలెక్టర్ సిబ్బందిని పంపి వారిని కాపాడగలిగారు. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో బస్సు మధ్యలో నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న అధికారులు తొలుత హెలికాప్టర్ సాయంతో బాధితులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు, స్థానికులు తాడు సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే మీడియాతో మాట్లాడుతూ బస్సులోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితులను తాము సమీక్షిస్తున్నట్లు తెలిపారు. మునగోడు, అవిశాయపాలెంలో ప్రాంతాల్లోనూ ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారని వారిని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెడ్డిగూడెం, బెల్లంకొండ రైల్వేస్టేషన్లలో పల్నాడు, శబరి, రఫ్తీసాగర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.
దీంతో రైలులోని ప్రయాణికులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఏపీలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 10 గేట్లను 4మీటర్ల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జలాశయానికి 4.6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 2.5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించామని, వారికి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications