నేడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శన: రాజకీయంగా కీలకమే...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శించనున్నారు. దీంతో ఆంధ్రాలో ఆల్ పొలిటికల్ పార్టీస్ హై అలెర్ట్ అయ్యాయి...జరగబోయే పరిణామాలని ఆసక్తిగా గమనిస్తున్నాయి. కారణం ఇటీవలే రాజకీయంగా పోలవరం ప్రాజెక్ట్ పలు సంచలనాలకు కారణమవ్వడమే...
Recommended Video

గతంతో వివాదాల విషయం పక్కనబెడితే ఇటీవలే పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు ఆపాలంటూ కేంద్రం రాసిన లేఖతో ఎంత పెనుదుమారం రేగిందో అందరికి తెలిసిన విషయమే. ఆ లేఖపై చంద్రబాబు కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పోలవరాన్ని నమస్కారం పెట్టి వదిలేస్తామనడం, ఆ వ్యాఖ్యలపై అన్ని రాజకీయపార్టీల నుంచి విమర్శలు, పవన్ కళ్యాణ్ పోలవరం సందర్శన-శ్వేతపత్రం డిమాండ్, వైసిపి బస్సు యాత్ర-తీవ్ర విమర్శలు, శ్వేతపత్రం ఇవ్వొచ్చు కదా అన్న ఉండవల్లి ప్రశ్న, మరికొన్ని రోజుల్లో కేంద్ర మంత్రి గడ్కరీ రాక...ఇలా ఇన్ని సంచలనాల మధ్య సిఎం చంద్రబాబు పోలవరం టూర్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

సిఎం సమీక్ష
పోలవరం చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట పోలవరం ప్రాజెక్ట పనులను పరిశీలిస్తారు. అనంతరం పనుల పురోగతితో సహా ప్రాజెక్ట్ కు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతోను ముఖ్యమంత్రి సమావేశమై దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలిసింది.

గడ్కరీ ఏమన్నారు....
ఇటీవలే పోలవరం ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి గడ్కరీ 2018కి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి కావలసిందేనన్నారు. ఆశించిన లక్ష్యంతో పనులు పూర్తికాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లక్ష్యానికి అనుగుణంగా మెయిన్ కాంట్రాక్టర్ పని చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. సబ్ కాంట్రాక్టర్లు కూడా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మెయిన్ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోతే తాను ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని గడ్కరీ అన్నారు. ఈనెల 22న ప్రాజెక్టును సందర్శించనున్నట్లు గడ్కరీ తెలిపారు. కొద్ది రోజుల వ్యవధిలో కేంద్ర మంత్రి గడ్కరీ రాక నేపథ్యం కూడా సిఎం చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత మరింత పెంచింది.

కాఫర్ డ్యాంను నిర్మించాల్సిందే..
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన కాఫర్ డ్యాంను నిర్మించాల్సిందేనని పోలవరంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అనుమతులను కేంద్రం నుంచి త్వరితగతిన పొందేందుకు కృషి చేయాలని ఈ కమిటీ పేర్కొంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ఒత్తిడి తీసుకువచ్చి త్వరితగతిన పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది.

పర్యటనకు ఏర్పాట్లు...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడ అధికారుల హడావుడి భారీగా కనిపించింది. జిల్లా కలెక్టర్ కె భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని సిఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.

భధ్రతా ఏర్పాట్లు...
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలవరం, ప్రాజెక్టు ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లుచేశారు. దీనిలో భాగంగా ఇద్దరు అదనపు ఎస్‌పిలు, అయిదుగురు డిఎస్‌పిలు, 11 మంది సిఐలు, 30 మంది ఎస్ ఐలు, 40 మంది ఎఎస్ ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 150 మంది కానిస్టేబుళ్లు, వంద మంది హోంగార్డులతోపాటు ఒక స్పెషల్ పార్టీ, బాంబు డిస్పోజల్స్ స్క్వాడ్ మాత్రమే కాకుండా జడ్‌ప్లస్ సెక్యూరిటీ భద్రత కూడా ఏర్పాటుచేశారు.

తదనంతర పరిణామాలు...
ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ కు సంబంధించి ప్రకంపనలు రేపుతున్నఈ పోలవరం ప్రాజెక్ట్ ను వివిధ పరిణామాలతో వేడెక్కి ఉన్నరాజకీయ వాతావరణం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించనుండటం, తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications