త్వరలో చంద్రబాబుకు కేంద్రం నుంచి నోటీసులు...నాకు ప్రాణహాని:నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ:'ఆపరేషన్ గరుడ' పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందంటూ సంచలనం సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సినీ నటుడు శివాజీ తాజాగా మరో బాంబు పేల్చారు.
శనివారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర సంస్థ నుంచి త్వరలో నోటీసులొస్తాయని చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాలు అడుగగా ప్రస్తుతానికి తాను ఇంతకుమించి ఏమీ చెప్పలేనని...ఇప్పటికే తనకు ప్రాణ హాని పొంచి ఉందని తెలిపారు. దీంతో నటుడు శివాజీ తాజా వ్యాఖ్యలు 'ఆపరేషన్ గరుడ' కంటే మరింత చర్చనీయాంశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన సినీనటుడు శివాజీ త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం నుంచి నోటీసులు రానున్నట్లు వెల్లడించడం ప్రకంపనలు రేపుతోంది. అయితే శివాజీని విలేకరులు అసలు ఆ నోటీసులు ఎవరిస్తారు..? ఎందుకిస్తారు..? అసలు ఈ వ్యవహారమేంటి? అని వివరాలు అడుగగా ఇంతకు మించి తనను ఇంకేమీ అడగొద్దని...తనకు ప్రాణ హానీ ఉందని శివాజీ తెలిపారు.
తనకు లభించిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రజలందరికీ ఈ విషయాలన్నీ ఇప్పుడే తెలియాలని బయటపెడుతున్నట్లు శివాజీ చెప్పారు. ఇదే మీడియా లేకపోతే తానెప్పుడో చనిపోయేవాడినని...ఇప్పటికే తనను చంపేందుకు రెండు సార్లు కుట్రపన్నారని శివాజీ చెప్పుకొచ్చారు. ఆ కుట్రల విషయం తనకు తెలిసినా ఇంతవరకూ బయటపెట్టలేదన్నారు. దేశంలో ప్రజాస్వామానికి అర్థం లేకుండా పోతోందని శివాజి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఆపరేషన్ గరుడ రూపం మార్చుకుని మరో రూపంలో రాష్ట్రంపై దాడికి దిగబోతున్నారని, ముఖ్యమంత్రిని రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి ఓ జాతీయ పార్టీ కుట్రకు తెర తీసిందని శివాజీ అన్నారు. ఒక సిఎంను టార్గెట్ చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం భావితరాలను ఇబ్బంది పెట్టడం కాదా అని ఆయన ప్రశ్నించారు.
హక్కుల కోసం అడిగితే వరవరరావును ఏం చేశారో చూశారు కదా అని అయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications