సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నంద్యాలలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ..నంద్యాలలో ఇవాళ జన సముద్రం కనిపిస్తోందని అన్నారు. మీ బిడ్డ జగన్ ఒంటరివాడు... సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు అన్ని పార్టీలు కూటమిగా వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఘాటు విమర్శలు చేశారాయన.పేదవాడి బతుకును చీకటి నుంచి వెలుగుకు తీసుకుపోతుంటే, మాయలమారి పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయని ప్రతిపక్షాలపై జగన్ ఫైర్ అయ్యారు.చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి. నరకాసురుడు, రావణుడు, దుర్యోదనుడు కలిశారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతామని జగన్ వ్యాఖ్యానించారు.

గతంలో చంద్రబాబు అబద్దాలు, మోసాలు చూశాం. ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయండి.బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? నారావారి పాలన రాకుండా చేసేందుకు మీరంతా సిద్ధమా? అంటూ ప్రజలను కోరారు.
రైతులు, వృద్ధులు, సామాజికవర్గాల వారీగా ఆలోచన చేయండి. అంధులు కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్లి మీ ఇల్లాలు, మీ పిల్లలు, మీ అవ్వా తాతలతో ఆలోచన చేయండి. ఎవరి వల్ల, ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది? మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది? అనేది ఆలోచన చేయండి. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అంటూ సీఎం జగన్ ప్రజలను కోరారు. మరోసారి ఫ్యానుకు రెండు ఓట్లు వేసి, ఇతరులతోనూ వేయించి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలు... మొత్తంగా 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా? అని ప్రజలను అడిగారు.
నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువులు అందుబాటులోకి తీసుకువచ్చాం. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, కాపు నేస్తం, జగనన్న తోడు, నేతన్న నేస్తం, ఆసరా, మత్స్యకార చేయూత... ఇలా మునుపెన్నడూ లేనంత సంక్షేమం అందిస్తున్నాం" అని సీఎం జగన్ వివరించారు.












Click it and Unblock the Notifications