సీఎం జగన్, చంద్రబాబు ఒకే చోట - ప్రతిష్ఠాత్మకం, ఉత్కంఠ..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. ఈ సమయంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో పర్యటనకు ఒకే రోజున రానున్నారు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో బస చేయనున్నారు. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరి నేతల పర్యటనల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు రాజమహేంద్రవరం వేదిక కానుంది.
పోలవరంలో ఇద్దరు నేతలు:సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు (సోమవారం) పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజమహేంద్ర వరంలో బస చేయనున్నారు. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరిట కొద్ది రోజులుగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఆయన ఆదివారం రాత్రికి ఏలూరు చేరుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం(అల్లూరి సీతారామరాజు జిల్లా)లో సీఎం.. చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు చింతలపూడి చేరుకుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30కు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు.

రాజమహేంద్ర వరంలో బస:ఇప్పటికే సీఎం జగన్ గోదావరి జిల్లాల పర్యటన ఖరారైంది. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరి కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 1.40 గంటలకు అదే మండలం గొమ్ముగూడెం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 2.20 గంటలకు గొమ్ముగూడెం చేరుకుని, అరగంట సేపు వరద బాధితుల నివాసిత ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తారు.2.55 గంటల నుంచి 3.25 గంటల వరకు వరద నష్టాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. సాయంత్రం 4.30కి రాజమండ్రి చేరుకుంటారు. చంద్రబాబు సాయంత్రం ఆరు గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మీదుగా దేవరపల్లి చేరుకుని రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేస్తారు.
రాజకీయ ఉత్కంఠ:జగన్, చంద్రబాబు సోమవారం రాత్రి రాజమండ్రిలో బస చేస్తుండడంతో అటు అధికారులు, ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి బీవీఆర్ ఫంక్షన్ హాలులో ప్రతిపక్ష నేత, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ లో సీఎం బస చేయనున్నారు. ఇక్కడే సీఎం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు. చంద్రబాబు మంగళవారం ఉదయం పోలవరం ప్రాజెక్టుకు కొద్దిదూరంలో సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి తిరుగు పయనంలో ఆయన కోరుకొండ వద్ద బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి విశాఖపట్నానికి బయల్దేరతారు. జగన్ కోనసీమలో గురజాపులంక, తానేలంక రామాలయంపేట, తోటరాముడివారిపేట, కొండుకుదురు గ్రామాల్లో పర్యటించి, వరద బాధితులతో మాట్లాడతారు. మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications