ఎవరూ టచ్ చేయలేరు, వారికి దడ పుడుతోంది : సీఎం జగన్..!!
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు మరోసారి మోస పూరిత హామీలతో ప్రజల వద్దకు వస్తున్నారని హెచ్చరించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే తమకు అందుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని చెప్పుకొచ్చారు. ఒకే ఒక్కడు ఒక వైపు..మరో వైపు చంద్రబాబు గ్యాంగ్ దాడి చేస్తోందన్నారు. చొక్కా చేతులు మడిచే సమయం వచ్చిందన్నారు. అబద్దాల యోధులను మట్టి కరిపించాల్సిన టైం వచ్చేసిందని జగన్ పిలుపునిచ్చారు.
మీ సేవలకు సెల్యూట్ : ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ల సేవలను ప్రశంసించారు. 58 నెలల కాలంగా చేసిన సేవలను అభినందించారు. వారి సేవా భావానికి సెల్యూట్ చేసారు. తన పాలనకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా జగన్ పేర్కొన్నారు. ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ తన పాలనలో ప్రభుత్వాన్ని ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు. 2.60 లక్షల వాలంటీర్ల సైన్యం ఈ రెండు నెలలు కష్టపడాలని సూచించారు. టీడీపీని అధికారంలో నుంచి దించటానికి కారణం జన్మభూమి కమిటీలు అయితే..తన పాలనలో ప్రతీ ఎన్నికల్లో విజయానికి కారణం వాలంటీర్ వ్యవస్థ అని జగన్ వివరించారు. చంద్రబాబు, పవన్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించారు. వీరికి దడ పుట్టిస్తున్నామంటే కారణం ప్రతీ పేదవాడికి మంచి చేయటమే కారణమని జగన్ వివరించారు.

జగన్ కీలక వ్యాఖ్యలు : జన్మభూమి కిమిటీలు దోపిడీ కోసం పుట్టాయన్నారు. వాలంటీర్లు, నవరత్నాలు, మేనిఫెస్టో సేవ కోసం పుట్టాయని వివరించారు. పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు ఇంటికి అందుతున్నాయని చెప్పారు. జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. వాలంటీర్ వ్యవస్థ ఒక తులసి మొక్కగా జగన్ విశ్లేషించారు. జన్మభూమి పాలన విషవృక్షం, వాలంటీర్ల సేవలు కల్పవృక్షంగా పేర్కొన్నారు. రూ 2.55 లక్షల కోట్ల రూపాయాలు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసామని జగన్ వివరించారు. మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటే పేద వాడి భవిష్యత్ మారుతుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో చంద్రబాబు కూర్చొని ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు తీసుకొని ఒక కిచిడి చేసి ఒక మేనిఫెస్టో తీసుకొస్తారని ఎద్దేవా చేసారు. వైసీపీ మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి పుడుతుందని... వారి కష్టాలకు సమాధానం ఇచ్చేలా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు. ఆ హామీలు అమలు చేయగలమా లేదా అనే ఆలోచన చేయని నైజం చంద్రబాబు సొంతమని విమర్శించారు.

యుద్దానికి సిద్దం : ప్రస్తుతం ఏడాదికి రూ 70 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. తాను అమలు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు ఎవరూ తప్పించలేనివి ఉన్నాయని వివరించారు. గతంలో ఏ మంచి చేయని చంద్రబాబు 1.26 లక్షల కోట్లు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇది మరో మోసంగా పేర్కొన్నారు. ఒక మాట వస్తే కష్టమైనా, నష్టమైనా ఆ వ్యక్తి మాట మీద నిలబడతాడనే నమ్మకం ఉండాలన్నారు. చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు సేవా సైన్యం సిద్దం అవ్వాలని పిలుపునిచ్చారు. పేద వాడి భవిష్యత్ మారాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వం రావాలని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటు వేయటం అంటే తమకు అందుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications