సీఎం జగన్ ఆపరేషన్ టీడీపీ, సీనియర్లకు బాధ్యతలు - చంద్రబాబు రివర్స్ గేమ్..!!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమరం హోరా హోరీగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు సీఎం జగన్, చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ అయింది. మూడు స్థానాలు దక్కించుకొని రాజ్యసభలో టీడీపీ జీరో చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. ఎలాగైనా ఒక సీటు గెలిచి జీరో కాకూడదనేది చంద్రబాబు వ్యూహం. ఇదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్దులను జగన్ ప్రకటించారు.
వైసీపీ అభ్యర్దులు ఖరారు:ఏపీలో మూడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏకగ్రీవం కాకుండా పోలింగ్ అవసరమైతే ఈ నెల 27న ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. అసెంబ్లీలో సభ్యుల బలం ఆధారంగా వైసీపీ మూడు సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. దీని ద్వారా టీడీపీ ఆవిర్భావం తరువాత రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో..చంద్రబాబు ఆ అవకాశం జగన్ కు ఇవ్వకూడదని భావిస్తున్నారు. తమ అభ్యర్దిని పోటీకి దించేందుకు సిద్దమయ్యారు. సంఖ్య బలం కోసం వైసీపీలో సీట్లు రాని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా పంచుమర్తి అనురాధను గెలిపించుకున్న విధంగా ఎన్నికల వేళ షాక్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.

కొత్త వ్యూహాలు:సీఎం జగన్ ఈ ఎన్నికల వేళ ముందస్తుగానే అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్దులను ఖరారు చేసారు.పార్టీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు గురువారం సచివాలయంలో సీఎం జగన్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది. టీడీపీ వ్యూహాలు గుర్తించిన సీఎం జగన్ సీనియర్లకు ఈ ముగ్గురి గెలుపు బాధ్యతలను కేటాయించారు. ఒక్కో అభ్యర్దికి అవసరమైన132 మంది ఎమ్మెల్యేలను మూడు టీంలు విభజించారు. వారి పర్యవేక్షణ బాధ్యత సీనియర్ నేతలకు కేటాయించారు. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు.
ఎవరికి దక్కేను:ముగ్గురు రాజ్యసభ అభ్యర్దుల నుంచి నామినేషన్ పత్రాల పైన సంతకాలు సేకరించారు. ఈ నెల 12న ఈ ముగ్గురూ నామినేషన్ వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం స్పీకర్ వద్ద 8 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత అంశం పెండింగ్ లో ఉంది. ఈ రోజు లేదా రేపు వారి పైన అనర్హత వేటు ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీంతో, అభ్యర్దుల గెలుపుకు కావాల్సిన సంఖ్య బలం ఆధారంగా టీడీపీ నేతలు కొందరు వైసీపీలో సీట్లు రాని అసంతృప్త ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందే ఒకరిని ఒకరు నైతికంగా దెబ్బ తీసేందుకు రాజ్యసభ ఎన్నికలను కేంద్రంగా మలచుకుంటున్నారు. టీడీపీ అభ్యర్దిని ప్రకటించనున్నారు. దీంతో, రాజ్యసభ ఎన్నికల పోరు ఇప్పుడు ఏపీలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications