దమ్ముందా - తోడేళ్లు ఒక్కటిగా : చంద్రబాబు -పవన్ కు సీఎం జగన్ సవాల్..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ సవాల్ చేసారు. తోడేళ్లు అన్నీ కలిసి వస్తున్నాయని ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ సవాల్ చేసారు. తోడేళ్లు అన్నీ కలిసి వస్తున్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు - పవన్ కల్యాణ్ కు సవాల్ చేసారు. తమ ప్రభుత్వం మంచి చేయలేదని భావిస్తే పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. మంచి చేసిన వారే గెలుస్తారని స్పష్టం చేసారు. ఏ సినిమాలో అయినా హీరోనే నచ్చుతారని చెప్పుకొచ్చారు. విలువలు లేని దుష్ట చతుష్ఠయంతో యుద్దం చేయాల్సి వస్తుందని చెప్పారు. గతంలో ఇదే రాష్ట్రం..ఇదే బడ్జెట్..కానీ, ఎందుకు ఈ తరహా మేలు చేయలేదని నిలదీసారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మంచే గెలుస్తుందన్నారు.
రెండేళ్లు సమయం ఇవ్వాలని..విద్యా వ్యవస్థ..విద్యార్దులు భవిష్యత్ రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. తిరువూరులో జగనన్న విద్యా దీవెన కింద 9.86 లక్షల మంది విద్యార్దులకు రూ 698.68 కోట్ల నిధులను విడుదల చేసారు. పేదరికం నుంచి బయట పడాలంటే విద్యతోనే సాధ్యం అవుతుందన్నారు.

ప్రతీ విద్యార్ధి సత్య నాదెళ్ల తరహాలో ఎదగాలని జగన్ ఆకాంక్షించారు. పేదలకు ఈ 45 నెలల కాలంలో జరిగిన మంచిని గమనించాలని కోరారు. కుటుంబ- రాజకీయ -మానవతా విలువలు లేని ఒక దుష్టచతుష్టయంతో యుద్దం చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. గతానికి ఇప్పటికీ తేడా చూడాలని కోరారు. ప్రతీ ఇంటికీ, ప్రతీ వర్గానికి అందిన సంక్షేమ ఫలాల పై అర్హత లేని వీరంతా రాళ్లు వేస్తున్నారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ బడులు కార్పోరేట్ పాఠశాలలతో పోటీ పడేలా రెండేళ్ల కాలంలో సమూలంగా మార్చుతానని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు డిజిటలైజ్ అవుతాయని చెప్పారు. 8వ తరగతి విద్యార్ధులకు టాబ్ లు ఇస్తున్నామని వివరించారు. ఉన్నత విద్యలో మార్పులు తెచ్చామని సీఎం వెల్లడించారు. డిగ్రీ చదువును ఇంగ్లీషులోకి మార్చేస్తామని చెప్పారు.

ఉపాధి కల్పనే లక్ష్యంగా బోధనలో మార్పులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ ఇంటా..అవ్వాతాత, అక్కా చెల్లి, రైతులు, విద్యార్దుల పట్ల బాధ్యతతో ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రతీ ఒక్కరి పట్ల నిండు మనసుతో స్పందించే మనసు తనకు ఉందని సీఎం చెప్పుకొచ్చారు.
సామాజిక.. మహిళా.. రైతు న్యాయం ఒక కర్తవ్యంగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గడప గడపలోనూ సంతోషం చూడాలని తపించే మనసు ఈ ప్రభుత్వానిదని చెప్పారు. ఏ పేద ఇంటికి వెళ్లినా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలు చేస్తున్నామని వివరించారు. 45 నెలల్లో డీబీటీ ద్వారా లక్షా 98 వేల కోట్ల అక్కా చెల్లమ్మల కుటుంబాలకు అందించామని వివరించారు.
ఏ పథకంలోనూ సిఫార్సులు ..వివక్ష లేకుండా అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఫీజు రీయంబర్స్ మెంట్ కింద గత ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ 13,311 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి వివరించారు. దేశంలో విద్యా దీవెన.. వసతి దీవెన ఎక్కడా లేవన్నారు. చదువుకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications