అచ్చెన్న పై వైసీపీ అభ్యర్ధి ఖరారు : ఈ ఎన్నికల్లో గెలిస్తే - సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!
టెక్కలి నియోజకవర్గం తనకు ప్రతిష్ఠాత్మకమని సీఎం జగన్ స్పష్టం చేసారు. అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సీఎం వ్యాఖ్యానించారు. టెక్కలి పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో 136లో 119 పంచాయితీలను గెలిచామని..అదే విధంగా 78కి 74 ఎంపీటీసీ స్థానాలను గెలవటంతో పాటుగా 4కి 4 ఎంపీపీ ..జెడ్పీటీసీ పదవులను గెలిచామని సీఎం పార్టీ నేతలకు వివరించారు. టెక్కలి లో మార్పు అంత స్పష్టంగా కనిపిస్తున్నదని, వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ ఎమ్మెల్యే గెలవాలని స్పష్టం చేసారు.
మీలో ఉన్న అభిప్రాయ బేధాలను పక్కన పెట్టాలని నిర్దేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే ఇంఛార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణతో మాట్లాడాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెలవాల్సిందేనని సీఎం మరోసారి స్పష్టం చేసారు. ఈ సారి గెలిస్తే వచ్చే 30 ఏళ్ల పాటు వైసీపీనే అధికారంలో ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు.మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా పక్కన పెడదాం, అందరం ఒక్కటై ముందుకు వెళ్దాం అంటూ సీఎం పార్టీ నేతలకు సూచించారు. ఇక, టెక్కలి నుంచి పార్టీ అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో దువ్వాడ శ్రీను పోటీ చేస్తారని సీఎం జగన్ నియోజవర్గ నేతలకు స్పష్టం చేసారు. అందరూ కలిసి కట్టుగా పని చేసి దువ్వాడను గెలిపించుకొని రావాలని నిర్దేశించారు.

కొంత మంది దువ్వాడ పైన ప్రతికూలత ఉందని..ఆయన ఎవరినీ కలుపుకొని వెళ్లరంటూ చెప్పే ప్రయత్నం చేసారు. దీనికి స్పందించిన సీఎం, కుటుంబం అన్నాక ఇవన్నీ సహజమని, అందరూ అన్ని విభేదాలను పక్కన పెట్టి పని చేయాలని సూచించారు. శ్రీనును ఎమ్మెల్యేగా గెలిపించి తీసుకొస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పేరాడ తిలక్ కు సీఎం హామీ ఇచ్చారు. అందరూ కలిసి పని చేయకపోవటం వలన శ్రీను గెలవకపోతే, ఆయన ఎమ్మెల్సీ పదవి కొనసాగించాలంటారని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. టెక్కలి సీటు ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. దువ్వాడకు మద్దతివ్వాలని సీఎం జగన్ ఇదే సమయంలో కృపారాణి కి సూచించారు. నియోజకవర్గంలో టికెట్ ఖరారు పైన అనిశ్చితి.. కుమ్ములాటలు ఉండకూడదనే ముందుగానే దువ్వాడ శ్రీను పేరు ఖరారు చేస్తున్నట్లు సీఎం వివరించారు.












Click it and Unblock the Notifications