సీఎం జగన్ నూతన సంవత్సర కానుక - ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ..!!
కొత్త సంవత్సరం ప్రారంభం వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎన్నికల హామీల అమల్లో మరో ముందడుగు వేసారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేసామని చెబుతున్న ముఖ్యమంత్రి..పెన్షన్ లబ్దిదారులకు నూతన సంవ్సతరం సందర్బంగా కానుక ప్రకటించారు. రేపటి నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది. ప్రస్తుతం అందిస్తున్న రూ 2,500 నుంచి 2,750 కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ రేపటి నుంచే అందించనుంది. పెన్షన్ పెంపు వేళ వారం రోజుల పాటుగా వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది.

నవరత్నాల్లో మరో హామీ అమలు
నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ 'నవరత్నాలు' హామీలో భాగంగా పెన్షన్‌ను దశల వారీగా పెంచుతామని, మొత్తం రూ. 3,000 అందిస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు ఏటా రూ. 250 చొప్పున పెన్షన్‌ను పెంచుతూ వస్తోంది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేస్తారు. దీంతో పాటుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న లబ్దిదారులే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం. దాంతో దేశంలోనే అత్యధికంగా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇక పాత, కొత్త పెన్షన్ లబ్ధిదారులు కలుపుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికిపైగా పెన్షన్ అందనుంది.

ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్
జనవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. జనవరి 3వ తేదీన రాజమండ్రిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొంటారు. లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. ప్రతిపక్షాలు పెన్షన్ లు కోత వేసేందుకు లబ్దిదారులను తగ్గించే ప్రయత్నాలను చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాయి. వీటి పైన స్పందించిన ముఖ్యమంత్రి ప్రతీ ఆరు నెలలకోసారి నిర్వహించే సర్వే ప్రక్రియ మాత్రమే సాగుతోందని చెప్పుకొచ్చారు. పెన్షన్లు పెరగటమే కానీ, తగ్గించే పరిస్థితి లేదన్నారు. జగన్ మనసు ఎరిగిన వారెవరూ వాటిని నమ్మరని చెప్పారు. టీడీపీ హయాంలో రూ 400 కోట్ల మేర పెన్షన్ బిల్లు ఉంటే, ఇప్పుడు ప్రతీ నెలా రూ 1700 కోట్ల మేర పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు.

కోతలు కాదు..పెరిగిన పెన్షన్లు
ప్రతీ ఏటా రూ 250 చొప్పున పెంచుకుంటూ పోతూ.. 2024 జనవరికి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రూ 3,000కు పెన్షన్ చేరనుంది. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ...రాజకీయంగా విమర్శలు చేస్తున్న ప్రత్యర్ధి పార్టీలకు సీఎం జగన్ తన నిర్ణయం ద్వారా సమాధానం చెప్పారని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. మేనిఫెస్టోలో మిగిలిన హామీల పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మేనిఫెస్టోలో చెప్పని మరిన్ని అంశాల పైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications