Milad-un-Nabi: ఏపీలో మిలాద్-ఉన్-నబీ సెలవు తేదీ మార్పు-తాజా ఉత్తర్వులు..!
మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా ఉద్యోగులకు ఇచ్చే సెలవు తేదీలో ఈసారి ప్రభుత్వం మార్పు చేసింది.
ముందుగా ప్రకటించిన తేదీకి బదులు మరో తేదీకి మారుస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో మిలాద్ ఉన్ నబీ సెలవును (Milad-un-Nabi Holiday) ఆగస్టు 25న మంగళవారంగా ప్రకటించగా.. ఇప్పుడు దాన్ని ఆగస్టు 26 బుధవారానికి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (పొలిటికల్-బి) శాఖ జి.ఓ.ఆర్.టి.నం.1675 జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీపై జి.ఓ.ఆర్.టి. నం.2277ను గతేడాది డిసెంబర్ 4న జారీ చేసింది. , అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి సమర్పించిన తాజా నివేదిక ప్రకారం రబీ ఉల్ అవ్వల్ మాసపు చంద్ర దర్శనం 12-08-2026న జరగలేదని, చంద్రదర్శనం ఆధారిత (Lunar Calendar) లెక్కల ప్రకారం రబీ ఉల్ అవ్వల్ 12వ తేదీ అయిన మిలాద్-ఉన్-నబీ ఆగస్టు 26 బుధవారం నాడు వస్తుందని వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి నివేదించింది.

వక్ఫ్ బోర్డు సమర్పించిన అభ్యర్థనను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించిన అనంతరం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 కింద మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రకటించిన సెలవును ఆగస్టు 25 నుంచి ఆగస్టు 26, 2026కు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసాధారణ గెజిట్‌లో సవరణ నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నారు. దీంతో ఉద్యోగులకు ఆగస్టు 26న ఈ సెలవు లభించనుంది.














Click it and Unblock the Notifications