ఇంట్లో అందరికీ పదవులు కావాలా?.. సినిమా డైలాగులు కొట్టడం సింపుల్ సుస్మిత!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది. తాజాగా రేవంత్ రెడ్డి పైన కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళానేత ఇందిరా శోభన్ ఘాటుగా స్పందించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మంచిది కాదని కొండా సుస్మితకు హితవు పలికారు. పార్టీలైన్ దాటి ముఖ్యమంత్రిని విమర్శించే అధికారం ఎవరిచ్చారని కొండా సుస్మితను ప్రశ్నించారు. ఆమె తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
పార్టీ లైన్ ప్రకారమే ఎవరైనా మాట్లాడాలని హితవు: ఇందిరా శోభన్
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న అచ్చమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషంగా లేరని సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అచ్చమైన కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీలో లేవన్నారు. పార్టీ లైన్ ప్రకారమే ఎవరైనా మాట్లాడాలని, నోటికి ఏది వస్తే అది మాట్లాడి చులకన కావద్దని హితవు పలికారు.

సుస్మితకు సీఎంను విమర్శించే హక్కు ఉందా?
మాట్లాడే మాట తీరు తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా ప్రశ్నించేలా ఉండకూడదని ఇందిరా శోభన్ హితవు పలికారు.తల్లిదండ్రుల చాటున రాజకీయాలు చేస్తున్న సుస్మితకు సీఎంను విమర్శించే హక్కు ఉందా అంటూ సవాల్ విసిరారు. అసలు సుస్మిత పార్టీలో ఉందా అంటూ ప్రశ్నించిన ఆమె, పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా మాటలు మాట్లాడొద్దని మండిపడ్డారు. నీతో ఎవరు ఈ మాటలు మాట్లాడి ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాలలో బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు.
సురేఖ అక్క కూతురు కాబట్టి నీకు ఇంకా గౌరవం ఇస్తున్నాం
ఇంట్లో అందరికీ పదవులు కావాలా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. సురేఖ అక్క కూతురు కాబట్టి నీకు ఇంకా గౌరవం ఇస్తున్నామని సుస్మితని సంబోధిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. కొండా సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. సినిమా డైలాగులు రాజకీయాలలో నడవమని విమర్శించారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఎలాంటి పదవులు లేకపోయినా వారందరిని వివాదాల్లోకి లాగడం మంచిది కాదన్నారు.
ఎవరిదైనా చిట్టా ఉంటే దానిని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలన్న ఇందిరా శోభన్
గతంలోనే కొండా సురేఖ ఒకసారి క్షమాపణలు చెప్పారని, మళ్లీ ఇటువంటి వివాదాలు సృష్టించడం వల్ల పక్క పార్టీలకు కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవులు అడగాలి తప్ప, పార్టీకోసం తను ఏం చేసిందని ఎమ్మెల్యే కావాలని కోరుకుంటుందని ప్రశ్నించారు. పొలిటికల్ గా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతుందని, రేవంత్ రెడ్డి అభిమానులు ఇటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. తన దగ్గర ఎవరిదైనా చిట్టా ఉంటే దానిని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని ఊరికే బెదిరించ కూడదు అంటూ హితవు పలికారు.












Click it and Unblock the Notifications