ఆ పిల్లలకు అండగా ఏపీ ప్రభుత్వం-ఫీజులు..చదువు బాధ్యతలు: కరోనాతో ఒంటరైన పిల్లల కోసం ఇలా..!!
అనేక మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి వేలాది పిల్లలను ఒంటరి వాళ్లను చేసింది. కొందరు పిల్లలు తల్లి దండ్రుల్లో ఒకరిని..మరి కొందరు ఇద్దరినీ కోల్పోయి ఆసరా లేక అనాధలుగా మారిపోతున్నారు. ఇప్పటికే ఇటువంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ పది లక్షల చొప్పున వారి పేరుతో డిపాజిట్ చేస్తోంది. ఇక, ఇప్పుడు తాజాగా వారి చదువుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అందు కోసం ప్రత్యేకంగా గైడ్ లైన్స్ విడుదల చేసింది.

ఏపీలో 6,800 మంది పిల్లల గుర్తింపు...
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రైవేటు స్కూల్‌లో.. ఎందులో చదువుతున్నా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటోంది. 2020, 2021ల్లో కరోనాతో 6,800 మంది పిల్లలు తమ తల్లి లేదా తండ్రిని లేదా ఇద్దరినీ కోల్పోయారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. ఇలా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే చైల్డ్ ఇన్ఫో డేటా ప్రకారం గుర్తించాలని అన్ని విద్యా సంస్థలకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఎక్కడ చదువుకుంటుంటే అక్కడే కొనసాగింపు..
కరోనా వల్ల అనాథలైన బాలబాలికలు ఏ పాఠశాలలో చదువుతున్నా అక్కడే వారు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇలా తల్లి-దండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఇబ్బందులు ఎదురైతే ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద వారికి అక్కడే చదువు చెప్పించనుంది. అలాగే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎవరైనా బడి మానేసి ఉంటే.. వారిని కూడా గుర్తించి ఉచిత విద్య అందించనుంది. తల్లిదండ్రులను కోల్పోయిన 6,800 మంది పిల్లల్లో ఇప్పటివరకు 4,333 మంది పిల్లల పూర్తి వివరాలను అధికారులు సేకరించారు.

ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు..
ఈ పిల్లల్లో 1,659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో, 2,150 మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నట్లుగా నిర్ధారించారు. మరో 524 మంది శిశువులుగా ఉన్నారని తేల్చారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలకు రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల వివరాలను విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చైల్డ్ ఇన్ఫోలో వెంటనే నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫీజులు అడిగితే కఠిన చర్యలు..
దీంతో పాటుగా..అటువంటి పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అక్కడే కొనసాగేలా చూడాలని సూచించింది. ఫీజు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆ విద్యార్థులను తొలగించరాదని.. తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఆ పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా జగనన్న విద్యా కానుక కింద వారికి మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగు, షూ, సాక్సులు, బెల్టు, డిక్షనరీలను మొదటి ప్రాధాన్యత కింద అందించాలని సూచించింది.
Recommended Video

అన్నీ ప్రభుత్వం నుంచే అందేలా..
వేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు తదితరాలను అందించేందుకు అయ్యే ఖర్చును విద్యా శాఖ భరించనుంది. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లల విషయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియచేయాలంటూ నిర్దేశించింది. అయితే, కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా చూడాలని సుప్రీంకోర్టు ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వివరాలను తమకు నివేదించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications