పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయ్: లీటర్ కు..!!
పెట్రో బాంబు మళ్లీ పేలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసల మేర పెరిగింది. ఈ మేరకు ఇంధన రేట్లను సవరిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 98.64 పైసలకు చేరుకోగా.. డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ. 91.58 పైసలు పలుకుతోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఈ తెల్లవారు జామున 6 గంటల నుండి ఈ కొత్త ధరలను అమలు చేస్తున్నాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ. 109.70, డీజిల్ ధర రూ. 96.07 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 104.49, డీజిల్ రూ. 96.11 పైసలుగా నమోదైంది.

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అయిదు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత శుక్రవారం నాడు తొలిసారిగా వీటి రేట్లను పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. పెట్రోల్, డీజిల్ పై ఏకంగా రూ. 3.50 పైసల వరకు పెంచాయి. ఆ తర్వాత సీఎన్జీపై పడ్డాయి. కేజీ సీఎన్జీ రేటును ఒక రూపాయికి పెంచాయి. తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పెంపుదలతో చమురు కంపెనీల రోజువారీ నష్టాన్ని రూ. 1,000 కోట్ల నుంచి రూ. 750 కోట్లకు తగ్గినట్లు వార్తలు వస్తోన్నాయి. అదే సమయంలో డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పడిపోతోండటం వల్ల ఈ పెంపుదల చాలట్లేదని చెబుతున్నారు. సోమవారం నాడు రూపాయి విలువ 96.17 పైసలకు పడిపోవడం వల్ల ఆయిల్ కంపెనీలకు వచ్చిన అదనపు ఆదాయం మొత్తం కూడా ఆవిరైంది. దీంతో తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించాల్సి వచ్చిందనే వాదనలు ఉన్నాయి.
చమురు కంపెనీలకు ఉపశమనం కలిగించేందుకు ప్రస్తుతం ఎటువంటి సబ్సిడీ ప్యాకేజీని పరిశీలించట్లేదంటూ ఇదివరకే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది కూడా. ఫలితంగా ఈ పెంపుదల దెబ్బ ఇక్కడితో ఆగకపోవచ్చు. రూ. 1,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకునేంత వరకూ కొనసాగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ పెంపుదల సాధారణ ప్రజలపై ద్రవ్యోల్బణం భారం పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications