ముస్లింల రిజర్వేషన్ల పై జగన్ కీలక ప్రకటన..!!
ఏపీ ఎన్నికల ప్రచారంలో ముస్లిం రిజర్వేషన్ల అంశం పైన వివాదం కొనసాగుతోంది. బీజేపీ అగ్ర నేతలు పలు రాష్ట్రాల్లో ప్రచారం సమయంలో ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్నారు. దీని పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తన వైఖరి స్పష్టం చేసారు. తాజాగా కర్నూలు లో జరిగిన ప్రచార సభలో కీలక ప్రకటన చేసారు.
మైనార్టీ రిజర్వేషన్ల పై
కర్నూలు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ముస్లిం రిజర్వేషన్ల అంశం పైన స్పందించారు. చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారని మండిపడ్డారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేసారు. మైనారిటీలకు రిజర్వేషన్లపై మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారని నిలదీసారు.

మత ప్రాదిపదికన ఇవ్వలేదు
నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదన్నారు. ముస్లింలలోని పటాన్, సయ్యద్, మొగల్స్ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటుతనం ఆధారంగానే ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసంవాళ్ల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా అంటూ ప్రశ్నించారు. ఎన్నార్సీ . సీఏఏ విషయంలో... ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, ఇజ్జత్ ఇమాందార్ కు మద్దతుగా నిలబడతాం. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని జగన్ అన్నారు.

అయిదేళ్ల పాలనలో గుర్తింపు
తన అయిదేళ్ల పాలనలో మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయం గుర్తు చేసారు. ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేల సీట్లు కేటాయించమని జగన్ వివరించారు. అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారు. మైనారిటీలను వేరుగా చూడడం సరికాదని జగన్ చెప్పుకొచ్చారు. మత ప్రాదికన ఇచ్చిన రిజర్వేషన్లు కాదనేది ప్రతీ ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఏ వర్గానికి నష్టం కలిగే నిర్ణయాలను తాము ఆమోదించమని జగన్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications