వెంటనే జిల్లాలకు వెళ్లండి : మంత్రులు- ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం..!!
వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా కడప..చిత్తూరు..అనంతపురం..నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీగా ప్రాణ నష్టంతో పాటుగా వందలాది గ్రామాలు నీట మునిగి లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.

వరద ప్రభావిత జిల్లాల మంత్రులు అక్కడే ఉండండి
ఇక, భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని సీఎం సూచించారు.

సహాయక చర్యలపైన ఫోకస్ పెట్టిండి
పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల పంపిణీ, జరిగిన నష్టంపై పక్కాగా అంచనాలు, పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు సాగు చేసేలా గతంలోనే ప్రకటించిన విధంగా వారికి విత్తనాలుఅందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలని సీఎం నిర్దేశించారు.

అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు
వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతంలోనే ఉండి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. 25 కేజీల బియ్యం , కేజీ కందిపప్పు , కేజీ వంటనూనె ఉచితంగా వరద ప్రభావిత జిల్లాల్లోని ప్రజలకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం , కేజీ కందిపప్పు , లీటర్ వంటనూనె , కేజీ ఉల్లిగడ్డలు , కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయనున్నారు . భారీ వర్షాలు కురిసిన చిత్తూరు , నెల్లూరు , కడప , అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు ఈ సాయం అందనుంది.
Recommended Video

నాలుగు జిల్లాల్లో భారీ నష్టం
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కడప జిల్లాలో ఎక్కువ మంది మరణించినట్లు అధికారిక లెక్కలు తేల్చారు. ఇంకా, అనేక మంది గల్లంతు అయ్యారు. ముందుగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని.. వరద తగ్గిన తరువాత నష్టం అంచనా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నెల్లూరు..కడప జిల్లాల్లో రైల్వే ట్రాక్ లు భారీగా దెబ్బ తినటం తో అనేక రైళ్లను దారి మళ్లించగా..పలు రైళ్లను రద్దు చేసారు. ఇంక, నెల్లూరు..ప్రకాశం..గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications