ఫ్రెండ్ కు మంత్రి పదవి గిఫ్ట్ ఇచ్చిన విజయ్
చిత్ర పరిశ్రమలో ఎంత కష్టపడినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. కానీ, విధి ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇదే నిజమైంది నటుడు, దర్శకుడు శ్రీనాథ్ జీవితంలో. కోలీవుడ్‌లో నటుడిగా నిలదొక్కుకోవడానికి దశాబ్దాల పాటు పోరాడి, ఆశించిన విజయం అందుకోలేకపోయిన శ్రీనాథ్.. నేడు ఏకంగా ఒక రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే స్థాయికి ఎదిగారు.
దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఊహించని రీతిలో సీనియర్ నాయకులను మట్టికరిపించి ఈ ఘనత సాధించారు. శ్రీనాథ్ సంచలన విజయానికి, ఆయనకు దక్కిన మంత్రి పదవికి వెనుక మూడు దశాబ్దాలుగా విజయ్ తో సుదీర్ఘ స్నేహం, అచంచలమైన విశ్వసనీయత దాగి ఉన్నాయి.

లయోలా కాలేజీ దోస్తీ.. 'నాళయ తీర్పు'తో ఎంట్రీ
శ్రీనాథ్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇద్దరూ చెన్నైలోని ప్రముఖ లయోలా కాలేజీలో క్లాస్‌మేట్స్. కాలేజీ రోజుల్లోనే వీరిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. విజయ్ 1992లో హీరోగా పరిచయమైన "నాళయ తీర్పు" చిత్రంలో శ్రీనాథ్ కూడా ఒక చిన్న సహాయక పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత విజయ్ స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలో, శ్రీనాథ్ మాత్రం పరిశ్రమలో తన ఉనికి కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
"12B", "కాదల్ వైరస్", "వట్టారమ్", "సంతోష్ సుబ్రమణ్యం", "వేట్టైకారన్" వంటి పలు సూపర్ హిట్ చిత్రాలలో కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేసినప్పటికీ, ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అటు బుల్లితెరపై "కాదలిక్క నేరమిల్లై" వంటి సీరియల్స్ చేసినా ఆశించిన బ్రేక్ దక్కలేదు. నటుడిగా ఫెయిల్ అయినప్పటికీ పట్టువదలకుండా దర్శకుడు జీవా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. ఆ తర్వాత "ముత్తిరై", సన్ ఎల్ పిక్చర్స్ నిర్మించిన "వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం" చిత్రాలకు దర్శకుడిగానూ మారారు. కానీ, సినీరంగం ఆయనకు చేదు అనుభవాలనే మిగిల్చింది.
రాజకీయాల్లో విజయ్ నమ్మినబంటుగా..
సినిమాల్లో విజయాలు రాకపోయినా, విజయ్‌తో శ్రీనాథ్ బంధం ఎప్పుడూ తెగిపోలేదు. విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) ప్రకటించినప్పుడు, అందరికంటే ముందుగా ఆయన పక్కన నిలబడింది శ్రీనాథ్ మాత్రమే. విజయ్ కోటరీలో అత్యంత నమ్మకమైన అసోసియేట్‌గా మారిన ఆయనకు, పార్టీలో అంతర్గత విభేదాలు, స్థానిక సవాళ్లు ఉన్నప్పటికీ.. విజయ్ వ్యూహాత్మకంగా తూత్తుకుడి (Thoothukudi) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించారు.
రాజకీయ దిగ్గజాన్ని పడగొట్టి.. కేబినెట్‌లోకి!
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ, విజయ్ నమ్మకాన్ని నిలబెట్టేందుకు శ్రీనాథ్ తూత్తుకుడిలో సుడిగాలి పర్యటనలు చేశారు. యువతను, సామాన్య ప్రజలను ఆకట్టుకుంటూ దూసుకెళ్లారు. ఎన్నికల ఫలితాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం తమిళనాడు రాజకీయ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. డీఎంకే (DMK) సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గీతా జీవన్‌ను ఏకంగా 37,000 ఓట్ల భారీ మెజారిటీతో శ్రీనాథ్ ఓడించారు.
MLA srinath avl now swearing in as a Minister..#CMJosephVijay #Vijay #CMVijay@TVKVijayHQ @CMOTamilnadu#Vijay #ThalapathyVijay #Thalpathy #TVKVijay #TVK #TVKVijayHQpic.twitter.com/nNhjCJrU9P
— Tamizhaga Vetri Kazhagam News (@TVKNewsUpdates) May 21, 2026
దశాబ్దాల సుదీర్ఘ స్నేహం, కష్టకాలంలో విజయ్ వెంట నడిచిన విశ్వసనీయత, అంతకుమించి అసాధ్యమనుకున్న నియోజకవర్గంలో సాధించిన అఖండ విజయమే శ్రీనాథ్‌ను ఈరోజు విజయ్ కేబినెట్‌లో మంత్రిని చేశాయి. వెండితెరపై ఫ్లాప్ నటుడిగా మిగిలిపోయిన శ్రీనాథ్, నేడు రాజకీయ క్షేత్రంలో 'రాజకీయ నాయకుడిగా' సూపర్ హిట్ అవ్వడం ఒక సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తోంది.














Click it and Unblock the Notifications