ఐఏఎస్ లు శ్రీలక్ష్మి - జవహర్ రెడ్డి : కీలక నిర్ణయం దిశగా సీఎం జగన్ - ఎలక్షన్ టీం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు పార్టీ పరంగా ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి..ఇటు పాలనా పరంగా నిర్ణయాలు ప్రారంభించారు. అందులో భాగంగా.. సీఎం కార్యాలయం నుంచి సీఎస్ వరకు..జిల్లా స్థాయిలోనూ అధికార వ్యవస్థలో అవసరమైన మార్పులకు నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి నియామకానికి రంగం సిద్దమైంది. సీనియర్ ఐఏఎస్ లను ఏ స్థానాల్లో నియమించాలనే దాని పైన కసరత్తు ప్రారంభించారు. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మీ..జవహర్ రెడ్డిలకు ప్రాధాన్యత దక్కనుంది.

సీఎం జగన్ ఎలక్షన్ టీం పై కసరత్తు..
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ తరువాత సీనియార్టీలో నీరభ్ కుమార్ ప్రసాద్, గిరిధర్, పూనం మాలకొండయ్య, కరికాల వలవన్ ఉన్నారు. అదే సమయంలో 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి పేరు రేసులో ఉంది. కానీ, ప్రధానంగా 1990 బ్యాచ్ కు చెందిన అధికారి జవహర్ రెడ్డి పేరు తొలి వరుసలో ఉంది. ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల టీంలో భాగంగా కొందరు అధికారులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. పని తీరు - సమర్ధత ఆధారంగా టీం ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక హోదాల్లో పని చేసి..టీటీడీకీ సీఎం ను ఒప్పించి మరీ వెళ్లిన జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎంఓలో ఉన్నారు. జవహర్ రెడ్డికి సీఎస్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

కొత్త సీఎస్ గా అవకాశం ఎవరికి..
అయితే ఆయన కంటే సీనియర్లు ఉండటంతో ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. సీనియర్లుగా ఉన్న వారిలో నీరబ్ సీఎస్ పోస్టు ఆశిస్తున్నారు. గిరిధర్ కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. పూనం మాలకొండయ్యకు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మీ 1988 బ్యాచ్ అధికారిణి. జవహర్ రెడ్డి కంటే సీనియర్. కానీ, శ్రీలక్ష్మీకి 2026 జూన్ వరకు సర్వీసు ఉంది. దీంతో..ప్రస్తుతం పెట్టుబడులు..మౌళిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న కరికాల వలవన్ కు ప్రస్తుతం సీఎస్ గా అవకాశం ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వరకు వలెవన్ సీఎస్ గా కొనసాగితే..ఎన్నికల సమయంలో జవహర్ రెడ్డిని సీఎస్ గా చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో శ్రీలక్ష్మికి ప్రాధాన్యత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలక్ష్మి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

కీలక మార్పులు చేర్పుల దిశగా
జవహర్ రెడ్డిని సీఎస్ గా అవకాశం కల్పిస్తే.. శ్రీలక్ష్మిని సీఎంఓలోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల తరువాత వచ్చే కొత్త ప్రభుత్వ నిర్ణయం మేరకు శ్రీలక్ష్మికి సీఎస్ గా అవకాశం ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంటుంది. ఇప్పటికే శ్రీలక్ష్మికి కేసుల పరంగా న్యాయస్థానం నుంచి రిలీఫ్ దక్కింది. శ్రీలక్ష్మి పైన ఉన్న ఓఎంసీ కేసును కోర్టు కొట్టి వేసింది. సీఎం జగన్ పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లోనూ సామాజిక వర్గాల ప్రస్తావన రాజకీయంగా వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కరికల వలెవన్ కు సీఎస్ గా అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం పైన ముఖ్యమంత్రి జగన్ తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications