జగన్ ఒక్కడే ఇటు వైపు, రాష్ట్ర ద్రోహులు ఒక్కటయ్యారు - మేము "సిద్దం"..!!
ప్రతిపక్షాల కూటమి పై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కడే అయినా..చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇంతమందితో పొత్తుల కోసం మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. ఈ పార్టీలకు సైన్యాధిపతులే కానీ, సైన్యం లేదని ఎద్దేవా చేసారు. కూటమిలోని కొన్ని పార్టీలకు గతంలో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. తమ స్వార్దం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు ఒక్కటయ్యాయని జగన్ మండిపడ్డారు.
వారంతా ఒక్కటయ్యారు : రాష్ట్ర ద్రోహుల పార్టీలు... ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిన పార్టీలు ఒక్కటయ్యాయని జగన్ ధ్వజమెత్తారు. ఇంటింటికి మంచి చేసి మనం సిద్దం అంటుంటే..మంచి చెప్పుకోలేరు కాబట్టి అరడజను పార్టీలతో పొత్తులు, ఎత్తులు, జిత్తులతో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంతో రాజకీయం చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు గతంలో జాతీయ రాజకీయాలను తానే ఏలానని, చక్రం తిప్పానని ఊదరగొట్టేవారన్నారు. ఏపీలో మన ప్రభుత్వం చేసిన మంచితో మన ప్రజా బలం ముందు తలపడలేక చంద్రబాబు అందరి సాయం తీసుకుంటున్నారన్నారు. ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని, దత్తపుత్రుడు తో కలిసి ఢిల్లీలో చంద్రబాబు మోకరిల్లుతున్నారని చెప్పుకొచ్చారు. జగన్ రాజకీయంలో విలువలు ఉన్నాయి. నిబద్దత ఉంది. సిద్దాంత బలం ఉంది. నిజాయితీ ఉందని వివరించారు.

పవన్ పై సెటైర్లు : చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు, టైర్లు, చక్రాలే లేవని జగన్ ఎద్దేవా చేసారు. ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడుని తెచ్చుకున్నారని సెటైర్ వేసారు. తన వాళ్లకు సీటు ఇవ్వకపోయినా దత్తపుత్రుడు అడగరన్నారు. తక్కువ సీట్ల పైన ప్రశ్నించరని... తాను తాగే టీ గ్లాస్ అంటే ఇచ్చేస్తారని వ్యాఖ్యానించారు. బాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు. విడిపోమంటే డ్రామాలు ఆడుతారని పవన్ ను ఉద్దేశించి జగన్ చెప్పుకొచ్చారు. 2014లో ఇలాగే మూడు పార్టీలు పొత్తులతో ముందుకు వచ్చారని..ఏ ఒక్కరికి అయినా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. జగన్ ను టార్గెట్ చేయటం ఏకైక అజెండాగా వ్యవహరిస్తున్నారని వివరించారు. మరో అయిదేళ్లు ఈ ప్రయాణం సాగిద్దామని కేడర్ కు జగన్ పిలుపునిచ్చారు. పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు సిద్దమా అంటూ పిలుపునిచ్చారు.

సింగిల్ గానే పోటీ చేస్తాం : పార్టీల పొత్తులతో బాబు వస్తుంటే... ప్రజలే బలంగా మనం సిద్దమయ్యామని జగన్ చెప్పారు. జగన్ ను ఓడించాలని వారు..పేదలను గెలిపించాలని మనం ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నామన్నారు. మరో చారిత్రక యద్దానికి మనం సిద్దం కావాలని పిలుపునిచ్చారు. విశ్వసనీయత- వంచన కు మధ్య జరిగే యుద్దంగా పేర్కొన్నారు. జమ్మి చెట్టు మీద ఇప్పటి వరకు దాచిన ఓటు అనే అస్త్రాన్ని రాష్ట్రం, పేదలకు మంచి చేసే కార్యక్రమాలకు పేదలకు అడ్డుపడుతున్న మీద ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని సూచించారు. చంద్రబాబు లాగా తనకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరని చెప్పారు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నానని జగన్ స్పష్టం చేసారు. తనకు పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ప్రతీ గడపలో ఉన్నారన్నారు. మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని..అందరూ సిద్దంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications