బద్వేలు ఉప ఎన్నిక బాధ్యత పెద్దిరెడ్డికి - ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే : మెజార్టీ ఇలా - సీఎం జగన్..!!
తన సొంత జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికను సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇందు కోసం ఉప ఎన్నిక పైన సమీక్ష నిర్వహించారు. పార్టీ నుంచి ఖరారు చేసిన అభ్యర్ధి దాసరి సుధ గెలుపు బాధ్యత లను పార్టీ నేతలకు అప్పగించారు. బద్వేలు ఉప ఎన్నిక ఇన్ ఛార్జ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తూ సీఎం నిర్ణయించారు. కడప జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు -మంత్రులతో సీఎం ప్రత్యేకంగా సమావేవమయ్యారు. 2019 లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో..ఉప ఎన్నిక అనివార్యమైంది.

2019 కంటే మెజార్టీ పెరగాలి
అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవటం.. ఆ కుటంబాని కే టిక్కెట్ ఇవ్వటంతో...ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు ముందుకు రావాలని వైసీపీ పిలుపు ఇచ్చింది. కానీ, ఇప్పటికే టీడీపీ అభ్యర్ధిని ఖరారు చేసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి బద్వేలులో పోటీ చేసిన ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ నే తిగిరి ఉప ఎన్నికకు ఎంపిక చేసింది. దీంతో...వైసీపీ తమ పట్టు నిరూపించుకొనేందుకు సిద్దమైంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావటంతో పార్టీ నేతలతో జగన్ సమీక్ష నిర్వహించి కీలక బాధ్యతలు అప్పగించారు. నామినేషన్ కార్యక్రమం నుంచి గెలుపు వరకు అందరి కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.

పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన వెంకట సుబ్బయ్యకు 44 వేల ఓట్ల మెజార్టీ వచ్చిందని..అంతకంటే ఇప్పడు ఎక్కువ మెజార్టీ రావాలని సీఎం నిర్దేశించారు. ఎక్కడా అతి విశ్వాసం చూపకుండా... ప్రతీ గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లాలని స్పష్టం చేసారు. 2017 ఎన్నికల్లో 77 శాతం ఓటింగ్ జరిగిందని..ఈ సారి మరింత పెరిగే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ప్రతీ సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని చెప్పారు. దీంతో..నియోజకవర్గ పరిధిలోని ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్ ఛార్జ్ గా నియమించారు. మొత్తం నియోజకవర్గ ఎన్నిక-సమన్వయం పెద్దిరెడ్డి చూస్తారని సీఎం స్పష్టం చేసారు.

ఒక్కో మండలం..ఒక్కో ఎమ్మెల్యేకు
ఈ ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించిన వారందరూ ఈ నెలంతా ఉప ఎన్నిక పైనే ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశించారు. వచ్చే వారం నుంచే ప్రచారం ప్రారంభించాలని సూచించారు. తమ రెండున్నారేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మంచిని వివరించి..ప్రతీ ఇంటికి వెళ్లేలా ప్రచార కార్యాచరణ సిద్దం చేసుకోవాలని చెప్పారు. నియెజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు ఇన్ ఛార్జ్ లుగా ఎమ్మెల్యేలు వరప్రసాద రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, సుధీర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

సీఎం ప్రచారం చేస్తారా..డౌటే
వీరు ఎప్పటికప్పడు ఎన్నికల ఇన్ ఛార్జ్ పెద్దిరెడ్డితో సమన్వయం చేసుకుంటూ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు. అయితే, తిరుపతి ఉప ఎన్నిక సమయంలో సీఎం జగన్ ప్రచారానికి ఒక బహిరంగ సభలో ప్రసంగించాలని భావించారు. అయితే, కరోనా తీవ్రత కారణంగా రద్దు చేసుకున్నారు. ఇక, ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నికలో సీఎం ప్రచారం అంశం పైన స్పష్టత రాలేదు. పార్టీ నేతలు మాత్రం సీఎం ప్రచారానికి వచ్చే అవకాశం తక్కవనే చెబుతున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం జగన్
అయితే..ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే విపక్షాల సమాచారానికి ఈ ఎన్నికలో వచ్చే మెజార్టీ ద్వారా సమాధానం చెప్పాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో..ఎక్కడా చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా షెడ్యూల్ వచ్చిన వెంటనే సమీక్ష ఏర్పాటు చేసి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక, బీజేపీ - జనసేన ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలనే అంశం పైన చర్చలు సాగుతున్నాయి. జనసేన అభ్యర్ధి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications